టెక్నాలజీతో వినియోగదారులకు బ్యాంకింగ్ వ్వవస్ధను మరింత సులభతరం చేయడంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. అందులో భాగంగానే యాపిల్ కంపెనీ నుంచి త్వరలో మార్కెట్‌లోకి రానున్న డిజిటల్ వాచ్ సహాయంతో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు తోడ్పడే అప్లికేషన్‌ను రూపొందించినట్లు ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు ప్రకటించాయి.
ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్‌లాల్ మాట్లాడుతూ త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న యాపిల్ వాచ్‌కి సరిపోయే యాప్‌ను తాము ఇప్పటికే సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రపంచంలోనే సమీపంలోని బ్యాంకు బ్రాంచ్ డిస్కౌంట్ అమ్మకాలు, స్టోర్లలో ఆఫర్లతో కూడిన లొకేషన్ ఆధారిత ఫీచర్లతో యాప్‌ను విడుదల చేసిన ఘనత ఐసీఐసీఐ బ్యాంకుకే దక్కుతుందన్నారు.
కస్టమర్లకు టెక్నాలజీని పరిచయం చేయడంలో తామెల్లప్పుడూ ముందు ఉంటామని చెప్పారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే వాచ్‌లకు సంబంధించిన అప్లికేషన్‌ను గతంలోనే పరిచయం చేశామని చెప్పుకొచ్చారు. మొదట్లో తమ వినియోగదారులు తమ ఖాతాలో ఉన్న నగదు నిల్వని చెక్ చేసుకోవడం, చివరి మూడు లావాదేవీలు తెలుసకోవడంతో పాటు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జింగ్, బిల్లు చెల్లింపులు వంటి కొన్ని లావాదేవీలు కూడా ఈ వాచ్ సహాయంతో నిర్వహించుకోవచ్చని సభర్‌లాల్ తెలిపారు.

యాపిల్ వాచ్ ధర ప్రారంభ ధర USD 549 నుంచి USD 1,099 వరకు ఉన్నాయి. యాపిల్ కంపెనీ తన మొట్టమొదటి వాచ్‌ని గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గత నెలలో 37 లక్షల లావాదేవీలను మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఐసీఐసీఐ కస్టమర్లు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఇక ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా యాపిల్ వాచ్ సహాయంతో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు తోడ్పడే అప్లికేషన్‌ను రూపొందించినట్లు ప్రకటించింది. 'వాచ్ బ్యాంకింగ్' సర్వీస్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులు 11 లావాదేవీలను ఈ వాచ్ సహయంతో నిర్వహించుకోవచ్చు.


Click it and Unblock the Notifications