న్యూఢిల్లీ: భారత్ గ్లోబల్ ఎకానమీగా అవతరించాలంటే సరైన సమయంలో విధానపరమైన చర్యలను తీసుకోవాలని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. అంతేకాదు ఫించన్ పథకాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు తాను వ్యతిరేకమని అన్నారు.
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్‌ను గ్లోబర్ ఎకానమీగా తయారు చేయాలంటే అనేక కొత్త పాలసీలను తీసుకురావాలన్నారు. ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ రఘరామ్ రాజన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూర్తి క్యాపిటల్ అకౌంట్ మారకం వైపు భారత్ మరలనుందన్న వ్యాఖ్యలను తాను పూర్తిగా మద్దతిస్తున్నానని చెప్పారు.
వీటితో పాటు గడువు ముగిశాక ఫించన్ పథకాలపై లభించే మొత్తంపై పన్ను విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ ఫించను పథకం ఖాతాదారులకు కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని, దీంతో ఈపీఎఫ్‌ఓకి సమాన స్ధాయి హోదా లభిస్తుందని పీఎఫ్‌ఆర్‌డీఏ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పన్ను చెల్లించకుండా చూసేందుకు ఎన్‌పీఎస్ కింద ఖాతాదారులు పలు పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన అన్నారు. ఇటీవలే దేశ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి అంతర్జాతీయ పైనాన్స్ సెంటర్‌ను గుజరాత్‌లో ప్రారంభించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.