రిటైర్మెంట్ పథకాల్లో భారీగా పెట్టుబడులు పెడితే పన్ను ప్రోత్సాహకాలు లభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పథకాలను తీసుకువచ్చేందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనికి సంబంధించి ఏడు సంస్ధలు ఆకర్షణీయమైన పథకాలతో మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి.
వీటిలో ఐడీబీఐ మ్యూచవల్ ఫండ్, సన్ లైఫ్ మ్యూచవల్ ఫండ్, డీఎస్‌పీ బ్లాక్‌క్ మ్యూచవల్ ఫండ్, యాక్సిస్ మ్యూచవల్ ఫండ్, ఎస్‌బీఐ మ్యూచవల్ ఫండ్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని కంపెనీలు ఈ జాబితాలో చేరే అవకాశాలున్నాయి.
గత ఏడాది డిసెంబర్‌లో రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈక్విటీ ఆధారిత పెన్షన్ పథకానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన విషయం తెలిసిందే. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు పొందనున్నారు.
ఇప్పటి వరకు బీమా కంపెనీలకు మాత్రమే పెన్షన్ ఉత్పత్తులను అందించడానికి అనుమతి ఉంది. అయితే ఈ ఏడాది ఈక్విటీ ఆధారిత పెన్షన్ పథకాలకు కూడా పన్ను ప్రయోజం చేకూర్చనున్నట్లు బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. దీంతో తాజాగా మ్యూచవల్ సంస్థలు ఆఫర్ చేసే పెన్షన్ ఉత్పత్తులకు కూడా పన్ను ప్రయోజనాలు కల్పించారు.
ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెడితే ఆదాయం పన్ను చట్టంలోని 80సి కింద 1.5 లక్షల రూపాయల వరకు మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది.