ఇక రోమింగ్ చౌక, మే 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: మొబైల్ టారిఫ్‌ల సీలింగ్‌ను టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్ధ (ట్రాయ్) తగ్గించడంతో మే నెల 1వ తేదీ నుంచి రోమింగ్ కాల్ ఛార్జీలు 23 శాతం, ఎస్ఎంఎస్ ఛార్జీలు 75 శాతం తగ్గనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రోమింగ్ టారిఫ్ ప్లాన్‌ని, ఆర్‌టిపి- ఎఫ్‌ఆర్‌ను ట్రాయ్ ఎత్తివేసింది.
మొబైల్ వినియోగదారులు హోమ్ సర్కిల్ నుంచి ఇతర టెలికం సర్కిళ్లు (రాష్ట్రాల) పరిధిలోకి వెళ్లినప్పుడు మొబైల్ ఛార్జీలన్నీ మారుతుంటాయి. దీన్నే రోమింగ్ ఛార్జీలంటారు. ఇప్పుడు కాల్, ఎస్ఎంఎస్‌లకు సంబంధించి గరిష్ట ఛార్జీల పరిమితిని ట్రాయ్ తగ్గించింది.

ట్రాయ్ తాజా ఆదేశాల ప్రకారం రోమింగ్ ఎస్‌టీడీ కాల్స్‌కు నిమిషానికి 1.5 రూపాయల నుంచి 1.15 రూపాయలకు, నేషనల్ ఎస్‌ఎంఎస్ రేట్లను 1.5 రూపాయల నుంచి 38 పైసలకు తగ్గనున్నాయి. ఇక రోమింగ్‌లో లోకల్ కాల్‌కు గరిష్టంగా నిమిషానికి 80 పైసల వరకు చార్జి చేయాలని ట్రాయ్ పేర్కొంది.
ప్రస్తుతం కంపెనీలు నిమిషానికి గరిష్ఠంగా రూపాయి వరకు వసూలు చేస్తున్నాయి. ఇకపై రోమింగ్‌లో లోకల్ ఎస్‌ఎంఎస్‌కు ఆపరేటర్లు గరిష్టంగా 25 పైసలు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కంపెనీలు లోకల్ ఎస్‌ఎంఎస్‌కు రూపాయి వరకు చార్జీ చేస్తున్నాయి. రోమింగ్‌లో ఇన్‌కమింగ్ కాల్‌కు వసూలు చేస్తున్న నిమిషానికి 75 పైసల రేటును 45 పైసలకు తగ్గించింది.
సొంత సర్కిల్‌లో టారిఫ్‌లు అమలు కావు:
అంతే కాకుండా టెలికాం ఆపరేటర్లు తప్పని సరిగా ప్రత్యేక రోమింగ్ టారిఫ్ ప్లాన్‌ను అందించాలని ట్రాయ్ తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో కస్టమర్లు ఫిక్స్‌డ్ చార్జీ చెల్లిస్తేనే ఉచిత ఇన్‌కమింగ్ పొందడం కుదురుతుంది. రోమింగ్ టారిఫ్ ప్లాన్ కింద వినియోగదారులు రోమింగ్‌లో కూడా హోమ్ సర్కిల్ రేట్లనే పొందడమే కాక ఇన్‌కమింగ్ కాల్స్‌ను ఉచితంగా పొందేవారు.


Click it and Unblock the Notifications