ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిర్వహించింది. ఈ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి ఎలాంటి ఆసక్తి చూపలేదు. గడచిన ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం పరపతి సమీక్ష మంగళవారం ముంబైలో జరిగింది.
ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణ కట్టికే కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. జనవరి 2016 నాటికి టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగువన ఉండేలా చూడటమే తమ లక్ష్యమని అన్నారు.
మరికొన్ని రోజులు రెపో రేటు 7.5 శాతం, సీఆర్‌ఆర్ 4 శాతం వద్ద కొనసాగుతాయని వివరించారు. భవిష్యత్తులో అవకాశం లభిస్తే వీటిని తగ్గిస్తామన్నారు. ఇక, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం వడ్డీ రేట్లు తగ్గి కాస్త ఊరట లభిస్తుందని భావించిన వారికి నిరాశే మిగిలింది.

సీఆర్అర్ అంటే ఏమిటి?
ప్రతి బ్యాంకు కూడా తాను ప్రజల నుండి వసూలు చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకు వద్ద జమ చేయాలి. అలా రిజర్వ్ బ్యాంకు వద్ద బ్యాంకులు రిజర్వ్ చేయవలసిన నగదుని 'కేష్ రిజర్వ్ రేషియా' అంటారు. ఇది చట్టబద్ధ ఏర్పాటు. డిపాజిటర్ల రక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్య తీసుకుంటుంది.
సీఆర్అర్‌ను తగ్గిస్తే మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయి. వివిధ కంపెనీలకు, వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం వస్తుంది. సీఆర్అర్ పెంచితే బ్యాంకుల వద్ద అందుబాటులో ఉండే నిధులు తగ్గిపోతాయి. ఆ మేరకు రుణాల జారీ కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం సీఆర్అర్ 4 శాతం. (ఫిబ్రవరి 9 వరకు ఇది 4.25 శాతంగా ఉండేది.) సీఆర్అర్‌ను నెలకొకసారి లెక్కిస్తారు.


Click it and Unblock the Notifications