వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న అమెరికా, భారత్‌పై ఎలాంటి ప్రభావం..?
వడ్డీ రేట్ల పెంపు తప్పదని, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ స్పష్టంగా ప్రకటించింది. వచ్చే జూన్ నుంచి అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అమల్లోకి రావొచ్చు. ఇదే జరిగితే 2006 తర్వాత తొలిసారి వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు అవుతుంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్ జెనెత్ యెల్లెన్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ "పేషెంట్" అన్న పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త వెలువడటంతోనే అప్పటిదాకా, నష్టాల్లో నడుస్తున్న అమెరికా డోజోన్స్ సూచీ లాభాల బాట పట్టింది.
అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల అక్కడి ఆర్ధిక వ్వవస్ధకే లాభం. వర్ధమాన దేశాలకు ఇబ్బందికర పరిస్ధితి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచితే తట్టుకునేందుకు అన్ని అస్ర్తాలతో సిద్ధంగా ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో అక్కడి రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీరేట్లను సున్న శాతం నుంచి పెంచనున్నట్లు అంచనాలు నెలకొనడంపై రాజన్ పైవిధంగా స్పందించారు. అక్కడ వడ్డీ రేట్లు పెరిగితే, భారత్ సహా వర్ధమాన దేశాల నుంచి భారీగా నిధులు తరలిపోతాయన్నది అంచనా. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినా, ఆ ప్రభావం నుంచి తట్టుకునేలా భారత్ సంసిద్ధంగా ఉందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం అనంతరం రాజన్ ప్రకటించారు.
విదేశీ మారక నిల్వలు అధికంగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడులు తరలిపోయినా తట్టుకునేలా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా చర్చలు తీసుకుందన్నారు. కరెంట్ ఖాతా లోటు ప్రస్తుతం ఆధీనంలోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో జీడీపీలో సీఏడీ 1.6 శాతంగా నమోదైంది.


Click it and Unblock the Notifications