ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇకపై 2, 4వ శనివారాలు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐబిఎ చైర్మన్, ఇండియన్ బ్యాంక్ సీఎండి టిఎం భాసిన్ తెలిపారు. కాగా ఈ రెండు రోజులను సెలవుల్లో కలిపేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్యన ఒక ఒప్పందం కుదిరింది.
అయితే ప్రస్తుతం అన్ని బ్యాంకులు శనివారం ఒక్కపూట మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్న నేపధ్యంలో కొత్తగా జరిగిన ఒప్పందం ప్రకారం నెలలో 1,3, ఏదైనా 5వ శనివారం అదనంగా వస్తే ఆ రోజు బ్యాంకులు పూర్తిగా పనిచేస్తాయని ఆయన తెలిపారు.
ఇక అందుకు బదులుగా 2,4 శనివారాలు పూర్తి సెలవులు తీసుకోనున్నాయి. అలాగే దీనితో పాటు ఉద్యోగుల వేతనాలను 15శాతం పెంచే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనితో ఈనెల 25వ తేదీ నుండి 4 రోజులపాటు జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విరమించినట్లుగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో 10వ ద్వైపాక్షిక వేతన సవరణను అంగీకరించినట్టు తెలిపారు. పెరిగిన జీతాలను 2012 నవంబర్ 1 నుంచి అమలు చేస్తారు. కొత్త ఒప్పందం వివరాలను 90 రోజుల్లో ఖరారు చేయనున్నారు.