60 ఏళ్ల తర్వాతే పింఛను: పరిశీలిస్తోన్న ఈపీఎఫ్ఓ
రిటైర్మెంట్ తర్వాత పింఛను పొందే వయస్సును 60 సంవత్సరాలకు పెంచే యోచనలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ (ఈపీఎఫ్ఓ) పరిశీలిస్తోంది. ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్ 95) కింద ప్రస్తుతం 58 ఏళ్ల వరకు నిధులను ఉద్యోగి/సంస్ధ జమ చేస్తుంది. 58 సంవత్సరాలు నిండిన తర్వాత పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు రిటైర్మెంట్‌లో మార్పు లేకున్నా పింఛను పొందే వయసును 60 సంవత్సరాలకు పెంచాలన్నది ఈపీఎఫ్ఓ ప్రతిపాదన. ఇది గనుక అమలైతే పెన్షన్ ఫండ్‌కి ఉన్న లోటు రూ. 26,067 కోట్ల మేర తగ్గిపోతుందని, సభ్యులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది.
ఇక వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన వారికి పింఛను అర్హత వయసు ప్రస్తుతం 50 కాగా, 55 సంవత్సరాలకు పెంచాలనేది ప్రతిపాదన. దీంతో మరో రూ. 12,028 కోట్లు లోటు తగ్గుతుంది. దీంతో పాటు రిటైర్మెంట్‌కి ముందు 60 నెలల వేతన సగటును తీసుకుంటుండగా, రాబోయే రోజుల్లో 36 నెలలు తీసుకోవాలన్నది మరో ప్రతిపాదన.
ఆన్‌లైన్ సహాయ కేంద్రం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ (ఈపీఎఫ్ఓ)లో ఖాతా ఉండి, ఉపయోగించకుండా ఉంటే... మీ ఖాతా పరిస్ధితి ఏంటో తెలుసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. దీని కోసం ఆన్ లైన్‌లో సహాయ కేంద్రాన్ని ప్రారంభిస్తోంది.
ఈపీఎఫ్ఓలో పని చేయని ఖాతాల్లో రూ. 27,000 కోట్ల మేర నగదు నిల్వ ఉంది. 36 నెలలు పాటు ఖాతాదారు/కంపెనీ నగదు జమ కాని ఖాతాలను పనిచేయని ఖాతాలుగా గుర్తించి, వీటిల్లోని నగదుకు 2011 ఏప్రిల్ 1 నుంచి వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేయడం లేదు.
యూఏఎన్ నెంబర్:
వృత్తి పరంగా రెండు, మూడు కంపెనీలు మారిన వారికి వేర్వేరు పీఎఫ్ ఖాతాలు ఇస్తున్నారు. పాత ఖాతాల్లోని నగదు అలానే ఉండిపోగా, మళ్లీ కొత్త ఖాతాలు తీసుకుంటున్నారు. ఇలాంటప్పుడు యూనివర్సల్ ఖాతా నెంబర్ (యూఏఎన్) సాయంతో పాత ఖాతాల్లోని నగదును ఖాతాదారులు తమ ప్రస్తుత పీఎఫ్ ఖాతాలోకి మళ్లించుకోవచ్చు.


Click it and Unblock the Notifications