హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు అరుదైన గౌరవం
హైదరాబాద్: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు అరుదైన గౌరవం దక్కింది. మార్కెట్ విలువ ఆధారంగా రెల్‌బ్యాంక్స్ ఈ టాప్-50 జాబితాను రూపొందించింది. 4,100 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన బ్యాంక్ 45వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా టాప్-50లోని ఏకైక భారతీయ బ్యాంక్ ఇదే కావడం గమనార్హం.

ఈ లిస్ట్‌లో క్రెడిట్ సూయిజీ, డీబీఎస్ గ్రూపు, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజాల కంటే హెచ్‌డీఎఫ్‌సీ ముందుండటం విశేషం. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 3,640 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో జాబితాలో 51వ స్థానంలో నిలిచింది. 3,342 కోట్ల డాలర్ల సంపదతో ఐసీఐసీఐ బ్యాంక్ 55వ స్థానంలో ఉంది.

ఇక అమెరికాకు చెందిన వెల్స్‌ఫార్గో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంది. 7 కోట్ల మందికిపైగా కస్టమర్లు, 9,000కు పైగా శాఖలు... 284 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్ధానంలో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(మార్కెట్ విలువ 270 బిలియన్ డాలర్లు), జేపీ మెర్గాన్ చేజ్(234 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
టాప్-10 బ్యాంకుల్లో అమెరికా, చైనాలకు చెందినవి చెరో నాలుగు బ్యాంకులు కాగా, బ్రిటన్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కో బ్యాంక్ స్థానం పొందాయి.


Click it and Unblock the Notifications