న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా (భారత్‌లో తయారు చేయండి) నినాదం కన్నా మేక్ ఫర్ ఇండియా (భారత్ కోసం తయారు చేయండి) మేలని రిజర్వు బ్యాంకు గవర్నర్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో మన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గినా ప్రభావితం చెందకుండా ఉండేలా దేశీయంగా డిమాండ్ పెంచడంపై దృష్టిసారించాలని అన్నారు.
రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు మార్కెట్ ఏకీకరణకు పాటుపడాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. పక్కాగా రూపొందించిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాన్ని ప్రవేశపెట్టడంతో పాటు రాష్ర్టాల సరిహద్దుల మధ్య విధించే పన్నులను తగ్గించాలని రాజన్ సూచించారు. అప్పుడే ఉత్పత్తులకు, సేవలకు జాతీయ మార్కెట్‌ను ఏర్పాటు చేయగలమని, భవిష్యత్ అభివృద్ధిలో ఇదే కీలమని ఆయన పేర్కొన్నారు.
దేశంలో పెట్టుబడులు పెరుగాలంటే కుటుంబాల్లో పొదుపును మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజన్ అన్నారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మున్ముందు బడ్జెట్లలో కుటుంబాలకు మరిన్ని పొదుపు ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి సూచించారు.

ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని రాజన్ పేర్కొన్నారు. రుణాల మంజూరు విషయంలో గతంలో చేసిన తప్పుల నుంచి బ్యాంకులు గుణపాఠం నేర్చుకోవాలన్నారు. అయితే బకాయి పడ్డ సంస్థల పునర్వ్యవస్థీకరణ బాటలో బ్యాంకులు అడ్డంకి కారాదన్నారు. కొత్తగా లైసెన్సులు మంజూరు చేసిన పూర్తి స్థాయి బ్యాంకులతోపాటు చిన్న, చెల్లింపు బ్యాంకులు కూడా ఏర్పాటు కాబోతున్నందున పోటీని తట్టుకునేందుకు ఇప్పుడున్న వారు మరింత సమర్థవంతంగా మారాల్సిన అవసరముందనారు.
ద్రవ్యోల్బణం నియంత్రణ లక్ష్యాన్ని 2-6 శాతం మధ్య శ్రేణిగా నిర్ణయించుకునే విషయంపై త్వరలోనే కేంద్రంతో ఆర్‌బీఐ చర్చించనుందని రాజన్ తెలిపారు. మున్ముందు సమీక్షల్లోనూ వ్యోల్బణాన్ని నియంత్రించడంతోపాటు నిలకడగా కొనసాగేటట్లు చూడటంపైనే దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.
మార్కెట్లో సెంటిమెంట్‌కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సెన్సెక్స్‌ను పరుగులుపెట్టించడం నియంత్రణ మండళ్ల పనికాదన్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలను, ద్రవ్య విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా స్థిరమైన వృద్ధి సాధనే తమ బాధ్యతన్నారు.


Click it and Unblock the Notifications