న్యూఢిల్లీ: స్పైస్ జెట్ రుణ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సహకరించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. దీని పైన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. స్పైస్ జెట్ అప్పులకు ప్రభుత్వం ఏదైనా హామీని ఇచ్చే అవకాశముందా అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. కంపెనీ పైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకున్న చర్యలను ఆయన సమర్థించారు.
స్పైస్ జెట్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుండి తిరిగి బయటపడుతుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. స్పైస్ జెట్ ఆర్థిక పరిస్థితిని, పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయడాన్ని పరిగణలోకి తీసుకొని కంపెనీకి చెందిన 186 స్లాట్లను డీజీసీఏ ఉపసంహరించింది. కాగా, స్పైస్ జెట్ సంక్షోభాన్ని కొన్ని సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ భారతీయ విమానయాన రంగం నష్టాల్లోనే కదలాడుతుందని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (కాపా) తెలిపింది. 1.3 బిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్ డాలర్ల (రూ. 7,807-8,408 కోట్లు) మేర నష్టాలను చవిచూడనుందని అంచనా వేసింది.
అయితే గత ఆర్థిక సంవత్సరం ఈ నష్టాలు 1.7 బిలియన్ డాలర్లుగా ఉన్న నేపథ్యంలో ఈసారి స్వల్పంగా నష్టాలు తగ్గుముఖం పట్టే వీలుందని చెప్పింది. అంతేగాక గత ఏడేళ్లలో భారతీయ విమానయాన పరిశ్రమ నష్టాలు 10.6 బిలియన్ డాలర్లు (రూ. 63,663 కోట్లు)గా ఉన్నాయని, మున్ముందు ఈ నష్టాలు మరింతగా ఎక్కువవుతాయని ఓ నివేదికలో పేర్కొంది. బకాయిలు సైతం 12.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 80,000 కోట్లు)కు చేరాయంది.


Click it and Unblock the Notifications