న్యూఢిల్లీ: విమానయాన రంగం కల్లోల భరరిత వాతావరణంలో పయనిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రయివేటు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, కింగ్ ఫిషర్ ఇప్పటికే కుప్పకూలగా, స్పైస్ జెట్ నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ రంగానికి గుండెపోటు తెప్పించేలా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం అన్నారు.
దేశీయ విమానయాన రంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అశోక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రంగం అనేక ప్రతికూల సమస్యలతో సావాసం చేస్తోందన్నారు. కొన్ని రకాల ఆంక్షల మూలంగా ఈ రంగంలో వృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని, భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇప్పుడు అమల్లో ఉన్న పలు నిబంధనలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా చేతిలో ఉన్న భూములను అభివృద్ధి చేసేందుకు సంబంధించి గురువారంనాడిక్కడ ఎయిర్ ఇండియా, నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో అశోక్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు కూడా పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల విమానయానరంగంలో పరిమిత వృద్ధే నమోదవుతోందని, పెట్టుబడులు తరలివచ్చి వృద్ధి జోరుగా ఉండాలంటే నిబంధనలను పునఃసమీక్షించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. మనం రూపొందించుకున్న నిబంధనలు మన పనితీరుకు అడ్డుగా వస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. అందరూ కలిసి పని చేస్తే మంచి వృద్ధిని సాధించవచ్చన్నారు. అందరూ కలిసి శ్రమించి పూర్వ స్థితికి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిర్ ఇండియా తన కీలక ఏవియేషన్ వ్యాపారంపై దృష్టి పెట్టాలన్నారు. ఎయిర్ ఇండియా ఆస్తులను ఎన్‌బిసిసి అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడం వల్ల దేశానికి ప్రయోజనం లభిస్తుందన్నారు.
ఈ భాగస్వామ్యం వల్ల ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగు పడుతుందని వెంకయ్య అన్నారు. ఎయిర్ ఇండియా ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆర్థికంగా ఈ కంపెనీని పరిపుష్ఠం చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా సంస్థ చేతిలో ఉన్న ఆస్తులను విక్రయించి పదేళ్ల కాలంలో 5,000 కోట్ల రూపాయలు సమకూరే విధంగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాగా, మంత్రుల సమక్షంలో ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ నందన్, ఎస్‌బీసీసీ ఎండీ అనూప్ కుమార్ మిట్టల్ ఒప్పందాలపై సంతకాలు చేశారు.


Click it and Unblock the Notifications