న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర బడ్జెట్‌లో రెండో తరం సంస్కరణలను ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం తెలిపారు. పిటిఐ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 6 శాతాన్ని అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
డిసెంబర్ 2న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష జరుపుతున్న క్రమంలో వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గిస్తుందన్న అంచనాను వెలిబుచ్చారు. వచ్చే బడ్జెట్‌పై మాట్లాడుతూ.. ఏడాది పొడుగునా సంస్కరణలు ఉంటాయన్నారు. బాసెల్-3 నిబంధనల్లో భాగంగా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు.

ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం 2015-16 వృద్ధిరేటు నిర్దేశంపై అడిగిన ప్రశ్నకు సమాధనమిస్తూ.. మొదట 5 శాతం వృద్ధిరేటు దిగువ నుంచి పుంజుకోవాల్సి ఉందన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా జిడిపి వృద్ధిరేటు 4.5 శాతం, 4.7 శాతంగానే ఉందని గుర్తుచేశారు. తయారీ, మౌలిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించాల్సిన అవసరం ఉందని, అప్పుడే దేశ జిడిపి పరుగులు పెడుతుందని వివరించారు.
గత ఆరు నెలలుగా తాము ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలనిస్తే త్వరలోనే తిరిగి భారత జిడిపి వృద్ధిరేటు 6 శాతాన్ని అధిగమిస్తుందన్న విశ్వాసాన్ని అరుణ్ జైట్లీ వెలిబుచ్చారు. వేలం తర్వాత వాణిజ్య అవసరాలకూ బొగ్గు తవ్వకాలను అనుమతిస్తామని జైట్లీ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపుల అనంతరం ప్రైవేట్‌రంగ సంస్థలకు గనులను కేటాయించి, తద్వారా వాణిజ్య అవసరాల మైనింగ్‌ను నాంది పలుకుతామన్నారు.
అయితే గనుల కేటాయింపుల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు రద్దు చేసిన 204 బొగ్గు బ్లాకుల వేలానికి అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 74 బ్లాకులకు తొలి దశలో వేలాన్ని నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications