చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై ప్లాంట్‌లో నవంబర్ 1 నుంచి మొబైల్ తయారీని నిలిపివేయాలని ఫిన్లాండ్ టెలికాం సంస్థ నోకియా మంగళవారం నిర్ణయించుకుంది. ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌ను శాసించిన నోకియాను సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో చెన్నై ప్లాంట్‌లో తయారైన మొబైల్ ఫోన్లను మైక్రోసాఫ్ట్ ఈ నవంబర్ 1 వరకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం నవంబర్ 1తో ముగుస్తుండగా, ఈ మేరకు సమాచారాన్ని నోకియాకు మైక్రోసాఫ్ట్ అందించింది. దీంతో ఇక చెన్నైలోని శ్రీపెరంబదూర్ ప్లాంట్ నుంచి మొబైల్ తయారీని ఆపేయాలని నోకియా నిర్ణయించుకుంది.
అయితే ఇక్కడ పనిచేస్తున్న 1,100 మంది ఉద్యోగుల భవితవ్యం మాత్రం ప్రశ్నార్థకం కానుంది. ఉద్యోగులకు నోకియా స్వచ్చంధ పదవీ విరమణ కూడా ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.
దీనికి అంగీకరించని ఉద్యోగులు ఆందోళనలూ చేశారు. మొబైల్ తయారీ వ్యాపారాన్ని నోకియా సంస్థ 750 కోట్ల డాలర్లకు మైక్రోసాఫ్ట్‌కు అమ్మేయగా, పలు కారణాల మధ్య చెన్నై ప్లాంట్ నోకియా-మైక్రోసాఫ్ట్ డీల్‌లో లేకుండా పోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న ఈ ఒప్పందం లావాదేవీలు పూర్తయ్యాయి.

కాగా, సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై పన్ను రాయితీ ఉందని ఉందని చెప్పి, నోకియా కంపెనీ పన్ను ఎగవేతకు పాల్పడిందని పన్నుల శాఖ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను నోకియా కోర్టులో సవాలు చేసింది. చెన్నైలోని శ్రీపెరంబదూర్‌లో నోకియా 2006లో ఉత్పాదక, ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభించింది.
గల్ఫ్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్ దేశాలకు ఎగుమతులు చేసింది. చెన్నై ప్లాంట్‌లో రూపొందించిన ఉత్పత్తులను ఎగుమతి చేయడమే కాకుండా, దేశీ మార్కెట్లో కూడా విక్రయించిందన్న కారణంతో తమిళనాడు ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా నోకియాకు నోటీసులకు జారీ చేసింది.
చెన్నై ప్లాంట్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు పరిధిలోకి తీసుకురావాలంటే 3,500 కోట్ల రూపాయల గ్యారంటీ సమర్పించాలని సుప్రీం కోర్టు మరో పన్ను కేసులో భాగంగా మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నోకియా తన తక్షణ ఉత్పాదక అవసరాల కోసం చెన్నై ప్లాంట్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను మైక్రోసాఫ్ట్‌తో ట్రాన్సిషనల్ సర్వీసెస్ ఒప్పందం కుదుర్చుకుంది.


Click it and Unblock the Notifications