విజయవాడ: తూర్పు తీరంలోని ప్రధాన రేవుల్లో ఒకటైన కృష్ణపట్నం పోర్టు ఎగుమతి, దిగుమతులకు ప్రధాన హబ్‌గా మారుతోందని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కెపిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ చింతా శశిధర్ తెలిపారు. శుక్రవారం రాత్రి భారత్ నుంచి నేరుగా మయన్మార్‌కు కంటైనర్ షిప్పింగ్ సర్వీసును ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ కెప్టెన్ నరులాతో కలసి శశిధర్, కంటైనర్ టెర్మినల్ నుంచి లాంఛనంగా కొత్త సర్వీసును ప్రారంభించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి మయన్మార్‌లోని యాంగాన్ ఓడ రేవుకు కంటైనర్ షిప్పింగ్ సర్వీసు నిర్వహణకు ఎస్‌సిఐ ముందుకు రావడంతో తూర్పు తీరంలో విదేశీ వాణిజ్యం కొంతపుంతలు తొక్కడం ఖాయమని శశిధర్ అన్నారు.

కృష్ణపట్నం పోర్టు నుంచి యాంగాన్ 1100 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన కంటైనర్ నౌక ఎస్‌సిఐ కమల్ ప్రతి 15 రోజులకు కృష్ణపట్నం, చెన్నై, కొలంబో, యాంగాన్ రేవులను కలుపుతూ సర్వీసులను నిర్వహిస్తుందని శశిధర్ చెప్పారు. కొత్త సర్వీసుతో ట్రేడర్లు గతంతో పోలిస్తే వేగంగా సరుకులను చేరవేయడంతో పాటు వ్యయాన్ని కూడా తగ్గించుకోగలరని ఆయన చెప్పారు.
క్లింకర్, టెలికాం ఎక్విప్‌మెంట్, ఆటోమొబైల్స్ ఎగుమతులకు, పప్పులు, కలప, గార్మెంట్స్ దిగుమతులకు ఈ కొత్త సర్వీసు వెసులుబాటు కల్పిస్తుందని చెప్పారు. సామాజిక సేవ కింద చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పటి వరకు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు శశిధర్ వెల్లడించారు.
యాంగాన్ సర్వీసుతో ట్రేడర్లకు విస్తృతమైన వ్యాపార అవకాశాలు లభిస్తాయని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నరులా అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్‌తో జట్టు కట్టడం ఆనందంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications