హైదరాబాద్: దేశీయ సెల్‌ఫోన్ల రంగంలోని ప్రధాన కంపెనీల్లో ఒకటైన సెల్‌కాన్ మార్కెట్లోకి చౌక ధరలతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఒపెరా మినీ మొబైల్ బ్రౌజర్‌తో కూడిన ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను క్యాంపస్ నోవా ఎ352ఈ పేరుతో బుధవారం లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు.
అయితే ఈ ఫోన్ దసరా తర్వాత నుంచి దేశవ్యాప్తంగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ లోపు ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని చెప్పారు. ఒపెరా సాఫ్ట్‌వేర్ సౌత్ ఏషియా వైస్ ప్రెసిడెంట్ సునిల్ కామత్‌తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త స్మార్ట్ ఫోన్ ధర 2,000 రూపాయల స్థాయిలో ఉంటుందని తెలిపారు.

ఇంత తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ఔస్, ప్రీ ఇన్‌స్టాల్డ్ ఒపెరా మినీ బ్రౌజర్, ప్లేస్టోర్, జిపిఆర్‌ఎస్, వైఫైతో కూడిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి అని మురళి చెప్పారు. కాంపస్ నోవా ఎ352ఈ స్ర్కీన్ సైజు 3.5 అంగుళాలు కాగా, 512 ఎంబి మెమొరీని 32 జిబి వరకు విస్తరించవచ్చని చెప్పారు. స్మార్ట్‌ఫోన్లలో 3000-5000 రూపాయల్లో ఉన్న ప్రారంభశ్రేణిని తాము 2000-5000 రూపాయల శ్రేణిగా పునర్‌నిర్వచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

త్వరలోనే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో సెల్‌కాన్ కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చే సన్నాహంలో ఉంది. 4 అంగుళాలు స్ర్కీన్‌తో 1 జిబి ర్యామ్, 4 జిబి మెమొరీతో కూడిన కార్డ్‌కోర్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో కంపెనీ స్థూలంగా అవగాహన కుదుర్చుకుంది. ఈ విషయం కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. గూగుల్‌తో కూడా సంస్థ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం సంప్రదిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications