స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిన సుప్రీం తీర్పు
హైదరాబాద్: 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేయడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిప్టీ 15 పాయింట్లు నష్టపోయి 8002.40 వద్ద ముగిసింది.
ఇక బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 26,744.69 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ సూచీలు లాభపడ్డాయి. పీఎన్ బీ, బీహెచ్ఎల్, బీపీసీఎల్, టాటా పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కంపెనీలు రెండు శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేశాయి.

1993 నుండి కేటాయించిన 214 బొగ్గు క్షేత్రాలను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం రద్దు చేసింది. ఇప్పటి వరకు 218 బొగ్గు క్షేత్రాలకు అనుమతించారు. ఇందులో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించారు. ఈ నాలుగింటిని మినహాయించి 214 బొగ్గు క్షేత్రాలను రద్దు చేసింది.
బొగ్గు గనుల కేటాయింపునకు ఎలాంటి ప్రాతిపదిక లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మైన్స్ కేటాయింపు ఏకపక్షంగా జరిగాయని ఆక్షేపించింది.46 గనుల లీజుదారులు ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 46 గనులలో మైనింగ్ చేస్తున్నందున వారు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 214 బొగ్గు క్షేత్రాలకు జరిమానా విధించింది. టన్నుకు రూ.295 చెల్లించాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications