న్యూఢిల్లీ: మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ మరోసారి కార్పొరేట్ రంగం మీద, యుపిఎ ప్రభుత్వానికి సారథ్యం వహించిన మన్మోహన్ సింగ్ మీద విమర్శనాస్ర్తాలు సంధించారు. బ్యాంకులు నిట్టనిలువునా మునిగిపోవడానికి కారణమైన కింగ్‌ఫిషర్ రుణ ఎగవేత వ్యవహారం మహా సముద్రంలో చిన్న నీటిబొట్టు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
'సన్నిహిత మిత్రులు' రుణాలు పొందడానికి తమ సంబంధాలను వినియోగిస్తుండటమే ఎన్‌పీఏల సమస్యలకు కారణమని ఆరోపించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు చాలా తక్కువగా ఉండడాన్ని గ్రహించాల్సి ఉందని తాజాగా వెలువరించిన పుస్తకం ‘ద డైరీ ఆఫ్ నేషన్స్ కాన్సన్స్ కీపర్-నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్'లో వినోద్ రాయ్ పేర్కొన్నాడు.

'ఇటీవల జరిగిన కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్, భూషణ్ స్టీల్స్ కేవలం పైకి కనిపిస్తున్న నీటి బిందువులు మాత్రమే. కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ ఇలాంటి తెరచాటు వ్యవహారాల్లో మరో కోణం' అని ఆయన పేర్కొన్నారు.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యాతో పాటు అదే కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెప్టెంబర్ 1న ప్రకటించింది. ఎస్‌బీఐ సారధ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంకు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ. 7 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 40 వేల కోట్ల రూపాయల వరకు రుణాలు సేకరించిన భూషణ్ స్టీల్స్ ఆర్థిక ఖాతాలపై బ్యాంకుల కన్సార్షియం ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే.
కంపెనీ రుణ పరిమితి పెంచేందుకు సిండికేట్ బ్యాంక్ ఛైర్మన్ ఎస్ కె జైన్ లంచం తీసుకున్న కేసులో భూషణ్ స్టీల్ వైస్ ఛైర్మన్ నీరజ్ సింఘూల్‌ను సీబీఐ అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఫోరెన్సిక్ ఆడిట్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు 2013లో 3.61 శాతానికి పెరిగాయని వినోద్ రాయ్ పేర్కొన్నారు. పిఎస్‌యు బ్యాంకుల బోర్డుల నియామకం గురించి ఆయన ప్రస్తావిస్తూ వారి నియామకాల్లో ఫిట్ అండ్ ప్రాపర్ సూత్రానికి పట్టించుకోవడం లేదనిఆయన విమర్శించారు.


Click it and Unblock the Notifications