హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మౌలిక, విద్యుత్ సర్వీసుల దిగ్గజ సంస్థ ల్యాంకో ఇండస్ట్రీస్ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. 3000 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్లను విక్రయించడం ద్వారా 5,000 కోట్ల రూపాయలను సమీకరించనున్నట్టుగా సంస్థ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితమే 1200 మెగావాట్ల ఉడిపి థర్మల్ ప్లాంట్‌ను అదానీ గ్రూప్‌నకు విక్రయించేందుకు ల్యాంకో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 6,000 కోట్ల రూపాయలు.
ఉడిపి ప్లాంటు విక్రయం తర్వాత సర్దుబాట్లు పోను నికరంగా 925 కోట్ల రూపాయల నగదు కంపెనీకి లభిస్తుందని సంస్థ వర్గాలు తెలిపాయి. కనీసం మరో 15,000 కోట్ల రూపాయల మేర రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ల్యాంకో ఉందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇన్‌ఫ్రా, నిర్మాణం, విద్యుత్ రంగాల్లో విస్తరించి ఉన్న ల్యాంకో పద్దుల్లో మొత్తం 49,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. వీటిపై నెలవారి వడ్డీల చెల్లింపునకు అవసరమైన మొత్తానికీ, సంస్థకు వస్తున్న రాబడికీ మధ్య అంతరం కారణంగా సంస్థ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది.
రుణభారాన్ని తగ్గించుకునే క్రమంలో భాగంగా, తొలుత కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. తర్వాత ఆస్తుల విక్రయంపై దృష్టి పెట్టింది. ల్యాంకో గ్రూప్‌లోని విద్యుత్ ప్రాజెక్టుల ఉమ్మడి ఉత్పత్తి సామర్ధ్యం 4,647 మెగావాట్లు. మరో 4,636 మెగావాట్ల సామర్ధ్యం గల ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. సంస్థ చేతుల్లో ఉన్న ఆర్డర్ల విలువ 21 వేల కోట్ల రూపాయలున్నట్టు చెబుతున్నారు.

ల్యాంకోకు రుణాలిచ్చిన 47 ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కూడా సంస్థ ఆర్థిక పరిస్థితిని దారిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తలకు మించిన రుణభారం కారణంగా సంస్థ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ల్యాంకో ఏ మాత్రం పట్టాలు తప్పినా అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సంక్షోభంలో పడతాయి. ఇప్పటికే గడువులోగా బకాయిల చెల్లించడంలో ల్యాంకో విఫలమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ బకాయిలే 1,700 కోట్ల రూపాయలున్నట్టు తెలిసింది. దీంతో బ్యాంకుల ప్రతినిధులు ఇటీవల ల్యాంకో అధికారులతో సమావేశమై ఆర్థిక పరిస్థితిని దారిలో పెట్టేందుకు సంస్థ తీసుకుంటున్న చర్యలపై వివరాలు కోరినట్టుగా తెలిసింది.
తక్షణమే విక్రయించడానికి అవకాశం ఉన్న ఆస్తులకు సంబంధించి అమ్మకంలో సహాయపడేందుకు కూడా బ్యాంకులు ముందుకు వచ్చినట్టుగా తెలిసింది. ల్యాంకో అధికారులు, బ్యాంకర్ల సమావేశానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్‌బి) చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కెఆర్ కామత్ సారథ్యం వహించినట్లుగా సమాచారం. ల్యాంకో కార్యకలాపాలకు అంతరాయం లేకుండా ప్రాధాన్యతా రుణాల విడుదల, నిధులయేతర సహాయాన్ని అందించేందుకు వెంటనే చర్యలు తీసుకునేందుకు బ్యాంకర్లు అంగీకరించినట్టు తెలిసింది. రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకునే విషయం కూడా రుణదాతలు పరిశీలించాలని ల్యాంకో ప్రతిపాదించినట్లు సమాచారం. ల్యాంకోకు అప్పులు ఇచ్చిన బ్యాంకుల్లో ఎస్‌బిఐతోపాటు ఐసిఐసిఐ, ఐడిబిఐలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications