'పిన్ లేని డెబిట్ కార్డులు' ఆలోచనలో ఎస్‌బీఐ
ముంబై: పిన్ సంఖ్యను ఎంటర్ చేయకుండా తక్కువ మొత్తంలో లావాదేవీలను చేసే విధంగా డెబిట్ కార్డుల జారీకి స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియాను అభ్యర్దించింది.
ప్రస్తుతం డెబిట్ కార్డు వినియోగానికి ఖాతదారులు తప్పనిసరిగా పిన్ సంఖ్యను ఉపయోగించవలసి వస్తోంది. మెట్రో రైలు, బస్ టికెట్ వంటి స్వల్ప మొత్తాలతో జరిపే కొనుగోళ్లకు దీనిని మినహాయింపు ఇవ్వాలనేది ఎస్‌బీఐ ఆలోచన.

రూ. 2,000లోపు మొత్తాలకు పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయకుండా డెబిట్ కార్డు వినియోగించుకొనే అవకాశాన్ని కల్పించాలని ఆర్‌బీఐని కోరామని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. కె మిశ్రా చెప్పారు. ఆస్టేలియా, సింగపూర్, బ్రిటన్‌లో ఇలాంటి 'కాంటాక్ట్ - లెస్' కార్డులు వినియోగంలో ఉన్నాయని తెలిపారు. మల్టీ కరెన్సీ ఫారిన్ ట్రావెల్ కార్డును సోమవారం ఆవిష్కరించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.
పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తే, డెబిట్ కార్డులను నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) తరహాలో రూపొందించవచ్చు. ఎటువంటి అనుసంధానం లేకుండా, రెండు ఎన్ఎఫ్‌సీ పరికరాలను దగ్గరగా ఉంచితే, వాటి మధ్య సమాచారం మార్పిడి జరుగుతుంది. ప్రస్తుతం ఈ డెబిట్ కార్డులను ప్రయోగాత్మకంగా ముంబై, చెన్నై మెట్రో రైల్ స్టేషన్లలో ఎస్‌బీఐ వినియోగిస్తోంది.


Click it and Unblock the Notifications