ముంబై: భారతీయులకు దుబాయ్ అత్యంత ఇష్టమైన పర్యాటక కేంద్రమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో భారతీయ పర్యాటకులు విదేశీ పర్యటనలకు ఎక్కువగా దుబాయ్‌నే ఎంచుకున్నారని హోటల్స్ డాట్‌కామ్ హోటల్ ప్రైస్ ఇండెక్స్ (హెచ్‌పిఐ) సర్వే ద్వారా తేలింది. ఇటీవల నిర్వహించిన ఈ సర్వేలో అత్యధిక భారతీయులు దుబాయ్ పర్యటన వైపే మొగ్గు చూపినట్లు రుజువైంది.
2012, 2013 సంవత్సరాల్లోని ప్రథమార్ధంలో అత్యధిక భారతీయులు బ్యాంకాక్ పర్యటనను కోరుకున్నారని, అయితే 2014లో మాత్రం దుబాయ్ పర్యటనకు తొలి ప్రాధాన్యతనిచ్చారని సర్వే చెప్పింది. కాగా, ఇదే సమయంలో ఆగ్నేయాసియా దేశాల్లో సింగపూర్, హాంకాంగ్, పట్టాయకు పర్యాటకులు పోటెత్తారని తెలిపింది. ఆ తర్వాత లండన్, న్యూయార్క్ నగరాలున్నాయి.

నిరుడు ఈ విషయంలో 10వ స్థానంలో ఉన్న పారిస్ నగరం ఈసారి 8వ స్థానానికి ఎగబాకింది. లాస్ వెగాస్ 9, కౌలాలాంపూర్ 10వ స్థానంలో ఉన్నాయి. మరోవైపు విదేశీ పర్యాటకులకు భారత్‌లోని అత్యంత ఇష్టమైన ప్రాంతాల్లో తొలి ఏడింటిలో తొలి స్థానంలో ఢిల్లీ నిలిచింది.
ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో వరుసగా, ముంబై, గోవా, బెంగళూరు, చెన్నై నగరాలున్నాయి. ఆరో స్థానంలో హైదరాబాద్ ఉండగా, ఏడో స్థానంలో జైపూర్ ఉంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా 8వ స్థానంలో ఉంది. నిరుడు ప్రథమార్ధంలో 9వ స్థానంలో ఉన్న ఆగ్రా.. తొలి 10 స్థానాల్లో ఈసారి చోటు సంపాదించుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications