నూఢిల్లీ: సబ్సిడీ సిలిండర్ల భారాన్ని తగ్గించుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్గాలు చూస్తోంది. ఇందులో భాగంగా నెలకు నిర్ణీత ఆదాయాన్ని కటాఫ్‌గా నిర్ణయించి అంతకన్నా ఎక్కువ సంపాదించే వారికి రాయితీ కట్ చేసి, మార్కెట్ ధరలకే అందించే దిశగా యోచిస్తోంది. అయితే, ఎంత సంపాదనను కటాఫ్‌గా తీసుకోవాలనే అంశాన్ని తనంత తాను నిర్ణయించకుండా, బహిరంగ చర్చల ద్వారా నిర్ణయించాలని భావిస్తోంది.
గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించే పథకాన్ని అమలు చేసి, ఆనక ప్రజాగ్రహానికి తలొంచిన యూపీఏ బాటలోనే నడిచే ప్రయత్నాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇది జరిగితే గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ లింకు, బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వంటి విధానాలు మళ్లీ అమల్లోకి వస్తాయి.

గ్యాస్ సిలిండర్ తరహాలోనే కిరోసిన్ రాయితీని కూడా నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే మళ్లించే అవకాశాలను పరిశీలిస్తోంది. ‘‘మేం పేదలకు రాయితీలను నిలిపివేయబోం. దానికి బదులు పంపిణీ వ్యవస్థలో ఉన్న అవకతవకలను అరికట్టడం ద్వారా ప్రభుత్వంపై సబ్సిడీల భారాన్ని తగ్గిస్తాం'' అని పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
‘‘ఎంత ఆదాయం ఉన్నవారు రాయితీ ధరలకు సిలిండర్లను పొందడానికి అర్హులో నిర్ణయించడానికి బహిరంగ చర్చలు నిర్వహిస్తాం'' అని ఆయన వివరించారు.ఇంధన వినియోగంలో అవకతవకలను అరికట్టేందుకు వినియోగదారుల వివరాల సంకలనం చేయడానికి కేంద్రం రాష్ట్రాల సహాయం తీసుకోనుంది.


Click it and Unblock the Notifications