విశాఖపట్నం: దక్షిణ భారతదేశంలోనే రెండవదైన ప్రతిష్ఠాత్మకమైన ‘ఎనర్జీ పార్కు' విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఇప్పటికే బెంగళూరులో ఒక దానిని నిర్వహిస్తుండగా విశాఖ సాగర్‌నగర్ సమీపంలో ఈపిడిసిఎల్ సేకరించిన ఎకరంన్నర స్థలంలో కొత్తగా ఎనర్జీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు, ప్రధానంగా విద్యార్థులకు ఈ పార్కు ద్వారా గాలి, నీరు, బొగ్గు వంటి వాటి ద్వారా విద్యుత్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుందనే అంశాలపై అవగాహన కల్పించడమే ఎనర్జీ పార్కు ప్రధానోద్దేశం.
అంతేగాక విద్యుత్ వినియోగంలో మెళకువలను కూడా తెలియచేస్తారు. ఇందులో అనేక రకాలైన మోడల్స్‌ను ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించేందుగానూ ఈపిడిసిఎల్ యాజమాన్యం పలు సంస్థలను ఆహ్వానిస్తోంది. స్థలం సమకూర్చుతామని, ఇందులో స్టాళ్ల నిర్వహణకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ముందుకు రావాల్సిందిగా ఈపిడిసిఎల్ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఇదే తరహాలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (విటిఎస్)ను ఈ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టింది.

గ్లోబల్ పోజిషన్ సిస్టమ్ (జిపిఎస్)లో భాగంగా చేపట్టే దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటును ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. వీటి ఏర్పాటులో ఎటువంటి జాప్యం లేకుండా, లెక్కల్లో పొరపాట్లు జరుగకుండా చూసే ఈ విధానం మరికొద్ది రోజుల్లో సంస్థ పరిధిలోని జిల్లాల్లో పూర్తిగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ప్రధానంగా సంబంధిత కార్యాలయం నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసే స్థలానికి చేర్చే వాహనాలకు జిపిఎస్ యూనిట్‌ను అమరుస్తారు. ఈ యూనిట్ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్ రవాణా, ఆ తరువాత దీనిని అమరుస్తున్న విధానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అందువల్ల ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఉండదు. జులై 1టవ తేదీ నాటికి కొలిక్కి రానున్న జిపిఎస్ విధానం అమలుకు త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications