టెక్ టాలెంట్: వరల్డ్ టాప్ 10లో హైదరాబాద్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ కలిగిన (టెక్కీలను)ఉద్యోగులను అత్యంత ఆకర్షిస్తున్న టాప్-10 గ్లోబల్ నగరాలలో భారతదేశంలోని ఐదు నగరాలు చోటు దక్కించుకున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరంలో పరిగణలోకి తీసుకున్న అంశాలను బట్టి ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ లింక్‌డిన్ అనే సంస్థ ఈ నివేదికను రూపొందించింది.
ప్రతిభ గల టెక్కీలను ఎక్కువగా ఆకర్షిస్తున్న నగరాల జాబితాలో భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరు అగ్రభాగాన ఉంది. ఆ తర్వాత పుణె, హైదరాబాద్, చెన్నై నిలిచి టాప్-4లో స్థానం దక్కించుకున్నాయి. మరో భారత నగరం గుర్గావ్ ఈ జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకుంది.

నివేదిక ప్రకారం.. బెంగళూరులో 45శాతం మంది టెక్కీలు కొత్త నివాసాలు ఏర్పర్చుకున్నారు. ఇది పుణె, చెన్నైలలో 43శాతంగా ఉండగా.. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఇది 31శాతంగా ఉండటం గమనార్హం. భారత సాంకేతిక రంగం అమితమైన అభివృద్ధిని సాధిస్తోందని, ప్రజలు గ్లోబల్ నగరాల వైపు చూస్తున్నారని, అందుకు ఈ నివేదికే నిదర్శనమని లింక్‌డిన్ రీసెర్చ్ కాన్సల్టెంట్ సోహన్ మూర్తి అన్నారు.
భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ 118 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందని తెలిపారు. అంతేగాక అనేక బహుళజాతి సంస్థలు భారతదేశంలో కొలువుదీరాయని చెప్పారు. 52 గ్లోబల్ నగరాలలో టెక్కీల కొత్త నివాసాలను ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. ఈ నగరాలు మధ్యస్థంగా 16శాతం కొత్త నివాసాల వృద్ధిని సాధించాయని చెప్పారు.
2013లో టెక్ టాలెంట్‌ను ఎక్కువగా ఆకర్షించిన నగరాలపై ఈ అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. పలు నగరాల్లో ఉంటున్న 30 కోట్ల మంది ప్రొఫైల్స్‌ను అధ్యయనం కోసం సేకరించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్ మేనేజ్‌మెంట్, జావా డెవలప్‌మెంట్, వెబ్ ప్రోగ్రామింగ్ లాంటి అంశాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications