తొలిసారి: ఇన్ఫోసిస్ కొత్త సిఈఓగా విశాల్ సిక్కా
బెంగళూరు: దేశీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజిస్ కొత్త సిఈఓ, ఎండిగా డాక్టర్ విశాల్ సిక్కా నియమితులయ్యారు. ఆయన ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐటి రంగంలో అపార అనుభవం ఉన్న విశాల్ సిక్కా.. ఇప్పటివరకు సాప్‌కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. కాగా, ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులు సిఈఓ, ఎండి బాధ్యతలు చేపట్టగా... ఇప్పుడు తొలిసారిగా వేరే వ్యక్తి ఆ బాధ్యతలను చేపడుతుండటం గమనార్హం.
నారాయణ మూర్తి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకొని గౌరవాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. బుధవారం నారాయణ మూర్తి బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా విశాల్ సిక్కాకు మంచి పేరుందని నారాయణ మూర్తి తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి చేసిన విశాల్ సిక్కా లాంటి మేధావి నాయకత్వంలో ఇన్ఫోసిస్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుందన్నారు.

కాగా, ఇన్ఫోసిస్ సిఓఓగా యుబి ప్రవీణ్ రావు నియమితులయ్యారు. జూన్ 14న నారాయణ మూర్తి తనయుడు రోహన్ మూర్తి ఇన్ఫోసిస్ నుంచి వైదొలగనున్నారు. క్రిస్ గోపాలకృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకొని నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతారని నారాయణ మూర్తి వెల్లడించారు.
జూన్ 15న ఇన్ఫోసిస్‌లో చేరనున్న విశాల్.. సంస్థ సిఈఓ, ఎండిగా ఆగస్ట్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా విశాల్ సిక్కా మాట్లాడుతూ.. డిజిటల్ ప్రపంచానికి భారత్ పేరును పరిచయం చేసింది ఇన్ఫోసిస్ అని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ సిఈఓగా బాధ్యతలు స్వీకరించడం తనకు సంతోషంగా ఉందన్నారు.
ఈ బాధ్యతను చేపట్టడం తను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.


Click it and Unblock the Notifications