ద్రవ్యోల్బణ కట్టడితోనే వృద్ధి: అరుణ్ జైట్లీ

‘వృద్ధి వేగాన్ని తిరిగి పుంజుకునేలా చేయడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, లాభదాయకమైన ఉపాధిని సాధించడానికి వృద్ధి తీరులో మార్పులు తీసుకు రావడం ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం' అని ఆదివారం తన ఫేస్‌బుక్ పేజిలో ఉంచిన వ్యాసంలో జైట్లీ పేర్కొన్నారు. దేశీయంగా తక్కువ ఖర్చుతో తయారీని పెంచడం, ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధరల స్థిరీకరణ, వృద్ధి ఒకదానితో మరోటి ముడిపడినవే అయినప్పటికీ ఈ రెండింటికీ వేర్వేరు వ్యూహాలు అవసరమన్నారు.
ద్రవ్య, ఆర్థిక విధానాల కలబోతతో ఆర్థిక లోటును సరిదిద్దడం కూడా దీనిలో ఇమిడి ఉందని జైట్లీ అన్నారు. ఆర్థిక లోటును తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక క్రమశిక్షణ దిశగా ముందుకు సాగడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం వృద్ది రేటును మెరుగుపర్చడం ఎంతయినా అవసరమని నొక్కి చెప్తూ, మనం ఈ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని, దీనివల్ల ప్రతి భారతీయుడి జీవితం మెరుగుపడ్డంతో పాటు, అణగారిన వర్గాలను పేదరికంనుంచి బైటికి తేవడానికి తోడ్పడుతుందని జైట్లీ అన్నారు.
ప్రధాని మోడీతో రాజన్ భేటీ
రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మంగళవారం ఆర్‌బిఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రకటించనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజన్ గత వారంలో కొత్త ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధికార బాధ్యతలు చేపట్టిన రోజునే ఆయనతో సమావేశమయ్యారు. మోడీతో సమావేశంలో రాజన్ స్థూల ఆర్థికాంశాలతో పాటుగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రధాని అధికార నివాసం రేస్‌కోర్స్ రోడ్ 7లోనే ఈ సమావేశం జరిగింది. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 4.7 శాతానికి పరిమితం కావడం, నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికీ గరిష్ఠ స్థాయిల్లోనే కదలాడుతూ ఉండడం వంటి కారణాల వల్ల ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications