కోల్‌ఇండియాకు రిజైన్: టి సిఎస్‌గా నర్సింగరావు!
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) ఎస్ నర్సింగ్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. మూడు నాలుగు రోజుల క్రితమే ప్రభుత్వానికి రాజీనామా పత్రాలను సమర్పించినట్లు, పదవి నుంచి వైదొలిగేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నానని నర్సింగరావు పిటిఐకి తెలియజేశారు.
నరేంద్ర మోడీ సర్కారు కేబినెట్‌లో బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన పియూష్ గోయల్.. నర్సింగరావు రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తాను కొత్త పాత్ర పోషించే అవకాశం ఉందని నర్సింగరావు చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నర్సింగ్‌రావు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.

2012 ఏప్రిల్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్‌గా నియమితుడైన నర్సింగ్‌రావు 2018లో పదవీ విరమణ పొందాల్సి ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్‌లో చేరడానికి ముందు నర్సింగరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
కాగా, సిఎండి పదవికి రాజీనామా చేసినప్పటికీ గురువారం ఢిల్లీలో జరగబోయే కోల్ ఇండియా బోర్డు సమావేశానికి నర్సింగరావు నేతృత్వం వహించనున్నారు. సంస్థ ఛైర్మన్ గా ఆయనకిదే చివరి బోర్డు సమావేశం కానుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక, వార్షిక ఫలితాలు వెల్లడించేందుకు బోర్డు సభ్యులు సమావేశమవుతున్నారు.


Click it and Unblock the Notifications