నష్టాలు నమోదు చేసిన ల్యాంకో ఇన్‌ఫ్రా
హైదరాబాద్: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగానూ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ 584 కోట్ల రూపాయల నష్టాలను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నష్టాలు 31.6 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. విద్యుత్, ఇపిసి విభాగాల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవటంతోపాటు త్రైమాసిక కాలంలో కంపెనీ రాబడి 23 శాతం క్షీణించి 2,762 కోట్ల రూపాయలకు పడిపోవటం వంటి అంశాలు ప్రభావం చూపించాయని ల్యాంకో ఇన్‌ఫ్రా వెల్లడించింది.
నిరుడు చివరి త్రైమాసికంలో రాబడి 3,570 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర నష్టాలు ఏకంగా 1,073 కోట్ల రూపాయల నుంచి 2,273.90 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ కాలంలో రాబడి కూడా 29 శాతం క్షీణించి 15,296 కోట్ల రూపాయల నుంచి 10,875 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.

నాలుగో త్రైమాసికం తోపాటు నిరుటి ఆర్థిక సంవత్సరంలో కాంట్రాక్టుల నిర్వహణలో జాప్యం తలెత్తటంతో పాటు వ్యయాలు, ధరలు పెరిగిపోవటంతో భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందని లాంకో పేర్కొంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇపిసి రాబడి ఏకంగా 48 శాతం క్షీణించి 4,345 కోట్ల రూపాయల నుంచి 2,255 కోట్ల రూపాయలకు పడిపోయాయని కంపెనీ పేర్కొంది.
ఇదే సమయంలో గ్రిఫిన్ కోల్ మైన్ రాబడి 65 శాతం తగ్గి 411 కోట్ల రూపాయల నుంచి 145 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని పేర్కొంది. మరోవైపు విద్యుత్ విభాగంలో మార్చి చివరి నాటికి వివిధ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి 2,823 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని తెలిపింది.


Click it and Unblock the Notifications