న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అంచనాలకు మించి ఆదాయాన్ని సముపార్జించింది. కాగా, ఎస్‌బిఐ నికర లాభం ఈ మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 7.83 శాతం క్షీణించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 3,041 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది జనవరి-మార్చిలో స్టాండలోన్ ఆధారంగా బ్యాంక్ నికర లాభం 3,299 కోట్ల రూపాయలుగా ఉంది. పెరిగిపోయిన మొండి బకాయిలు, భవిష్యత్ వేతన సవరణ వంటివి ఈసారి లాభాల క్షీణతకు కారణమని శుక్రవారం బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
అయితే ఆదాయం మాత్రం గతంతో పోల్చితే పెరిగింది. ఈసారి 42,443 కోట్ల రూపాయల ఆదాయం నమోదైతే, పోయినసారి 36,331 కోట్ల రూపాయలతోనే సరిపెట్టుకున్నట్లు ఎస్‌బిఐ స్పష్టం చేసింది. నికర వడ్డీ ఆదాయం 16.4 శాతం పెరిగి 12,903 కోట్ల రూపాయలను తాకింది. ఇక మొండి బకాయిలు క్రిందటిసారితో పోల్చితే 48.05 శాతం పెరిగి 5,884 కోట్ల రూపాయలకు చేరాయి. అంతకుముందు 3,974 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఇవి 7,587 కోట్ల రూపాయలుగా ఉంటే, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 4,461 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ.. అధిక మొండి బకాయిలు, భవిష్యత్తులో వేతనాల సవరణతో లాభాలు తగ్గిపోయాయన్నారు. అసెట్ క్వాలిటి మెరుగయ్యేందుకు తొలిసారిగా రిస్క్ మేనేజ్‌మెంట్లలో కొన్ని పరిమాణాత్మక మార్పులు చేయదలిచామని చెప్పారు. కాబట్టి ఇకపై అసెట్ క్వాలిటీ బాగుటుందనే విశ్వాసాన్ని భట్టాచార్య వెలిబుచ్చారు. మరోవైపు ప్రమాదకర స్థాయిలో ఉన్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) అదుపునకు కొన్ని కమిటీలు వేశామని తెలిపారు. ఇక ఈ మార్చి ఆఖరు నాటికి బ్యాంకు డిపాజిట్లు 13,94,409 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
అడ్వాన్సులు 12,45,122 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం క్రెడిట్ వృద్ధి 15-16 శాతంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భట్టాచార్య చెప్పారు. నికర నిరర్థక ఆస్తులు 2013 మార్చి నాటికి 21,956 కోట్ల రూపాయలుగా ఉంటే, 2014 మార్చి నాటికి 31,096 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. 1,397 కోట్ల రూపాయల మేర మొండి బకాయిలను వసూలు చేశామని, 1,148 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశామని బ్యాంక్ తెలిపింది. ఈ జనవరి-మార్చి వ్యవధిలో ఆపరేటింగ్ ఆదాయం 19,488 కోట్ల రూపాయలుగా ఉంటే, ఆపరేటింగ్ లాభం 10,628 కోట్ల రూపాయలుగా ఉంది.
ఐటిసి లాభం 2,278 కోట్లు
బహుళ వ్యాపార సంస్థ ఐటిసి ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో నికర లాభాలను 18.16 శాతం పెంచుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల వ్యవధిలో 2,278.01 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. కోల్‌కతాకు చెందిన ఈ సంస్థ గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 1,927.9 కోట్ల రూపాయల నికర లాభాలతో సరిపెట్టుకుంది.
సంస్థాగత వ్యయం తగ్గించుకోవడమే లాభాలకు ప్రధాన కారణంగా సంస్థ తెలిపింది. పోయినసారి 5,757.77 కోట్ల రూపాయలుగా ఉంటే, ఈసారి 5,272.95 కోట్ల రూపాయలకు పరిమితమయ్యాయి. నికర అమ్మకాలు 11.79 శాతం పెరిగి 9,145.14 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అంతకుముందు ఇవి 8,180.30 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో ఐటిసి వెల్లడించింది.


Click it and Unblock the Notifications