న్యూఢిల్లీ/ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఓటర్లు స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంపై దేశ పారిశ్రామిక రంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ బిర్లా మాట్లాడుతూ.. ‘కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం శుభపరిణామం. ఇది మదుపర్ల ఆత్వవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అధిక పెట్టుబడులను ఆకర్షిండమేగాక, ఉద్యోగవకాశాల సృష్టికి, ముఖ్యంగా తయారీ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుంది.' అని పేర్కొన్నారు.
‘బిజెపికి వచ్చిన మెజారిటీ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న మదుపర్ల ఆశలను సాకారం చేసింది. విధానపరమైన నిర్ణయాలు వేగవంతం అవుతాయన్న భరోసాను కల్పిస్తోంది. రాబోయే 18-24 నెలల్లో ఆర్థిక వృద్ధి 10 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.' అని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ తెలిపారు. ఇక వెల్‌స్పన్ రెన్యువబుల్స్ ఎనర్జీ వైస్ చైర్మన్ వినీత్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘ఇది భారత ప్రజల విజయం. స్పష్టమైన మెజారిటీతో ఏర్పడుతున్న ఈ సుస్థిర ప్రభుత్వం వల్ల పారిశ్రామిక రంగంలో విశ్వాసం పెరుగుతుంది. అంతర్జాతీయంగా, విదేశీ మదుపర్లలోనూ ఆ విశ్వాసం ఇనుమడిస్తుంది.' అని పేర్కొన్నారు.

‘దేశ ఆర్థిక వ్యవస్థలో లక్షలాదిగా ఉద్యోగవకాశాలు పెరగడానికి, వృద్ధిరేటు పెరగడానికి కొత్త ప్రభుత్వం తయారీ రంగంలో సంస్కరణలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం.' అని పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శరద్ జైపురియా పేర్కొన్నారు. ‘కార్మిక సంస్కరణలు, కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు అవసరమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు మోదీ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది.' అని ఇంజినీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహ మండలి (ఇఇపిసి) చైర్మన్ అనుపమ్ షా అభిప్రాయపడ్డారు.
11 నెలల గరిష్ఠానికి రూపాయి
నరేంద్ర మోడీ ప్రభంజనం ఫారెక్స్ మార్కెట్‌నూ తాకింది. డాలర్ విలువతో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. 50 పైసలు పెరిగి 58.79 స్థాయి వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు డాలర్లను పెద్ద ఎత్తున విక్రయించడంతో రూపాయి మారకం విలువ బలపడింది. దీంతోపాటు స్టాక్‌మార్కెట్లలోకి వచ్చిన విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులూ రూపాయి పెరుగుదలకు దోహదం చేశాయి. కాగా, గురువారం రూపాయి మారకం విలువ 59.29 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications