ఎన్నికల ఫలితాలు: రికార్డు హైకి స్టాక్‌మార్కెట్లు
ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచి సెన్సెక్స్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 25,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన సెన్సెక్స్ 1,109 పాయింట్లు పెరిగి ఒకానొక దశలో 25, 014 స్థాయికి చేరుకుంది.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వెలువడుతుండటంతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ కూడా భారీ స్థాయిలో పెరిగింది. 336 పాయింట్లు పెరిగి.. 7,459 మార్క్‌ను అందుకుంది. మరోవైపు రూపాయి కూడా దూసుకెళుతోంది. 2013 తర్వాత 59 పైసలు బలపడింది.

గురువారం కూడా మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి. గురువారం స్టాక్ మార్కెట్లు పటిష్ఠమైన స్థితిలో ప్రారంభమైనాయి. ప్రారంభ దశలోనే సెన్సెక్స్ 23,971.78 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరుకుంది.
అయితే రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఐటి, లోహ, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా ఆ తర్వాత ఒక దశలో 23,742.75 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినా చివర్లో హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లతో 90.48 పాయింట్ల వృద్ధితో 23,905.60 పాయింట్ల సరికొత్త ముగింపు రికార్డును నమోదు చేసుకుంది. ముఖ్యంగా టాటా స్టీల్ స్టాక్స్ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications