న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపులో తాను తప్పు చేసి ఉంటే ప్రధానమంత్రి.. తనను పదవి నుంచి అప్పుడే తొలగించేవారని బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణ రావు అన్నారు. ఒడిశాలోని తలబిరా-2 బొగ్గు బ్లాకుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ దాసరిని సిబిఐ ఇప్పటికే ప్రశ్నించిన విషయం విధితమే. కాగా, సోమవారం దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపి నవీన్ జిందాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి).. నల్లధనం చలామణి అభియోగాలను మోపింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు సిబిఐ చేసిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఈడి.. నల్లధనం నియంత్రణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. బొగ్గు శాఖకు సంబంధించిన పనులపై తుది నిర్ణయాన్ని కేబినెట్ మంత్రి శిబుసోరేన్, ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే తీసుకున్నారని దాసరి పేర్కొన్నారు. బొగ్గు గనుల కేటాయింపులో శిబూ సోరేన్, తాను అక్రమాలకు పాల్పడ్డట్లు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాసరి తెలిపారు. పరాఖ్ ఆరోపణలన్నీ ప్రతిపాదిత బిడ్డింగ్‌కు సంబంధించినవనీ (బొగ్గు బ్లాకుల కేటాయింపు), వీటిని తాను తిరస్కరిస్తున్నానని, అసలు ఈ విషయంలో ఎవరికీ సహకరించలేదని, అయినా సహకరించటానికి తానెవరని దాసరి ప్రశ్నించారు.

కేటాయింపుల విషయాల్లో కొన్నిసార్లు కేబినెట్ మంత్రి శిబూ సోరేన్, కొన్ని సందర్భాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారని దాసరి అన్నారు. మంత్రిత్వ శాఖలో కొత్త నిబంధనలను తీసుకురావటంతో ప్రాక్టికల్‌గా సమస్యలు తలెత్తాయని తెలిపారు. ఎక్కడైనా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టినప్పుడు సాంకేతికంగా సమస్యలు తలెత్తటం సాధారణమైన విషయమనీ, వీటిని తాను గుర్తించి ప్రధాని లేదా కేబినెట్ మంత్రి ముందుంచానని దాసరి నారాయణ రావు చెప్పారు. అయితే ఈ సమస్యలు అంతగా ప్రాధాన్యత కలిగినవి కాకపోవటంతో సంబంధిత మంత్రి దీనిపై సత్వర నిర్ణయం తీసుకోలేకపోయారని ఆయన వివరించారు.
ఒకవేళ తాను తీసుకున్నవి తప్పుడు నిర్ణయాలని తెలిస్తే ప్రధాని అప్పుడే తనను పదవి నుంచి తప్పించేవారని, అలాంటివి లేకపోవటంతోనే తాను పదవిలో కొనసాగగలిగానని అన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించినంత వరకు తీసుకున్న ఏ నిర్ణయమైనా సోరేన్ లేదా ప్రధాని ఆదేశాల మేరకు తీసుకున్నదేనని, ఇందుకు తగ్గట్టుగానే దర్యాప్తు సంస్థలు ముందుకు సాగాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రధాని తీసుకున్నదే తుది నిర్ణయం అవుతుందని, ఒకవేళ కొంతమంది ఈ విషయంలో ప్రశ్నించాలని కోరుకుంటే ఇందుకు దర్యాప్తు సంస్థలు, ఇతర ఏజెన్సీలు ఉన్నాయని దాసరి అన్నారు.
కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) నియామకాల కోసం డబ్బులు తీసుకున్నట్లు పరేఖ్ తన పుస్తకంలో ఆరోపించటంపై దాసరి స్పందించారు. పరాఖ్ ఒక పుస్తకం రాసుకోవచ్చు... అవసరమైతే సినిమా కూడా తీసుకోవచ్చు.. దీంతో తనకు ఎలాంటి సమస్యలేదని అన్నారు. పదవిలో ఉండగా ఎంతో మంది సిఎండిలను నియమించానని.. ఒక్క సిఎండి తన వద్దకు రాలేదని దాసరి స్పష్టం చేశారు. వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడు డబ్బులు అడిగినట్లు వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అసత్యాలనీ అన్నారు.


Click it and Unblock the Notifications