రుణపరిమితి పెంచాలి: చిదంబరం, ‘రెడ్డీ’స్‌పై కేసు
న్యూఢిల్లీ/హైదరాబాద్ : గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా శక్తిని పుంజుకుంటోందని ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల రంగం సహా భారత్ వంటి వేగంగా పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థలు భారీగా పెట్టుబడులను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఆదివారం జరిగిన ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ గవర్నర్ల బోర్డు 47వ వార్షిక తొలి వ్యాపార సమావేశంలో చిదంబరం మాట్లాడారు.
ఆసియా అభివృద్ధి బ్యాంకు వనరులను కూడా గణనీయంగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. వచ్చే పదేళ్లలో వార్షిక రుణ పరిమితిని 2,000 కోట్ల డాలర్లకు పెంచాలని ఎడిబిని చిదంబరం కోరారు. సభ్య దేశాల్లో అభివృద్ధి కార్యకలాపాలు నానాటికి విస్తృతమవుతున్నాయని అందుకనుగుణంగా రుణ పరిమితిని పెంచాలని సూచించారు. గడచిన ఐదేళ్లలో ఆర్డినరీ క్యాపిటల్ రీసోర్సెస్ (ఒసిఎస్) కింద ఎడిబి సాధారణ మూలధన పెంపు (జిసిఐ), వార్షిక రుణ సామర్థ్యం 1,000 కోట్ల డాలర్ల నుంచి 1,100 కోట్ల డాలర్లకు పెరిగాయని ఆయన అన్నారు.

దారిద్య్ర నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాల్లో సభ్య దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, అందుకే వచ్చే పదేళ్లలో రుణ సామర్థ్య పరిమాణాన్ని రెండింతలు పెంచాలని కోరుతున్నట్లు చిదంబరం తెలిపారు. రుణ పరిమితి పెంపుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని సభ్యులను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంట్ ఉల్లంఘన కేసు
హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్‌కు వ్యతిరేకంగా డబ్లిన్‌కు చెందిన అమరికన్ ఫార్మా పేటెంట్ ఉల్లంఘన కేసు దాఖలు చేసింది. తనకు పేటెంట్ హక్కులున్న వాసెపా ఔషధానికి జనరిక్ వెర్షన్లను తీసుకు వచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. జనరిక్ వెర్షన్‌ను మార్కెట్ చేయడానికి డాక్టర్ రెడ్డీస్ సమర్పించిన అబ్రీవియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్(ఏఎన్‌డిఏ) 16 అంశాలతో వాసెపా పేటెంటును అతిక్రమించగలదని అమరికన్ తెలిపింది. రెడ్డీస్, అనుబంధ కంపెనీ, ఇతర విభాగాలు గానీ ఈ ఔషధం తయారీ, వాడకం, విక్రయం, అమ్మజూపడం, కొనుగోలును శాశ్వతంగా నిషేధించాలని కోర్టుకు అమరికన్ ఫార్మా కోర్టుకు విన్నవించింది.


Click it and Unblock the Notifications