భారత మామిడి మాకొద్దు: ఈయు, నిషేధం
లండన్: భారత్ నుంచి అల్ఫన్సా రకానికి చెందిన మామిడి పండ్లతోపాటు మరో నాలుగు రకాల కాయగూరల దిగుమతిపై యూరోపియన్ యూనియన్ (ఈయు) తాత్కాలికంగా నిషేధం విధించింది. మే 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని 28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ హెల్త్ రెగ్యులేటరీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, ఈయూ నిర్ణయంపై ఐరోపా యూనియన్‌లోని సభ్యదేశాల్లోగల భారత సంతతికి చెందిన పౌరులు, ప్రజాప్రతినిధులు, వాణిజ్య, వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గత ఏడాది భారత్ నుంచి ఐరోపా యూనియన్‌లోని దేశాలకు దిగుమతి అయిన 207 రకాల పండ్లు, కూరగాయల్లో పురుగులు, ఇతరత్రా క్రిమికీటకాలను ఐరోపా యూనియన్ స్టాండింగ్ కమిటి ఆన్ ప్లాంట్ హెల్త్ గుర్తించింది. దీని సిఫార్సుతో యూరోపియన్ కమిషన్ ఈ తాత్కాలిక నిషేధాన్ని ప్రతిపాదించింది. మామిడితోపాటు, వంకాయ, చేమ దుంప, కాకర కాయ, పొట్లకాయల దిగుమతిపై ఈ నిషేధం వర్తించనుంది. వీటి దిగుమతి నిరోధానికి ‘ఫటోసానిటరీ సర్టిఫికేషన్' వ్యవస్థను కూడా ఈయు తీసుకురానుంది.
అయితే ఇవన్నీ కూడా భారత్ నుంచి ఐరోపా యూనియన్‌లోని దేశాలకు దిగుమతి అవుతున్న మొత్తం తాజా పండ్లు, కూరగాయల్లో 5 శాతం లోపే కావడం గమనార్హం. అయినప్పటికీ వీటి మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్నవారిలో ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మామిడి వ్యాపారుల్లో ఐరోపా యూనియన్ తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర నిరసనలకు దారితీస్తోంది. ఇక్కడ ఏటా దాదాపు 6 మిలియన్ పౌండ్ల మామిడి వ్యాపారం జరుగుతుంది. భారత్ నుంచే 16 మిలియన్ల మామిడి ఇక్కడి మార్కెట్‌లోకి దిగుమతి అవుతుంది.

ఈ క్రమంలో విధించిన నిషేధం తమను చాలా నష్టపరుస్తుందని, పైగా ఈ నిషేధం సవరించడానికి 2015 డిసెంబర్ 31 వరకు గడువుండటంతో వందలు, వేల పౌండ్ల నష్టం వాటిల్లుతుందని హోల్‌సేల్, రిటైల్ వ్యాపార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇది పిచ్చి నిర్ణయమని, భారత్ నుంచి బ్రిటన్‌కు శతాబ్దాల కాలం నుంచి మామిడి దిగుమతి అవుతోందని భారత సంతతికి చెందిన ఎంపి కీత్ వాజ్ అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభావితమయ్యేవారిని సంప్రదిస్తున్నానన్న ఆయన యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడికి దీనిపై ఓ లేఖను రాస్తున్నట్లు కీత్ వాజ్ చెప్పారు.
అంతేగాక ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కూడా లేఖ రాస్తానన్నారు. ‘గత ఏడాది బ్రిటన్‌లోనే తొలిసారిగా లీసెస్టెర్‌లో మ్యాంగో ఫెస్టివల్ నిర్వహించగా, దానికి విశేష స్పందన వచ్చింది. అయితే తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఈసారి ఫెస్టివల్ నిర్వహణ రద్దయ్యే వీలుంది. నిజానికి భారత్ నుంచి దిగుమతి అవుతున్న మామిడిని లక్షలాది బ్రిటన్ ప్రజలు తింటున్నారు. దానివల్ల ఇప్పటిదాకా వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు.' అని కీత్ వాజ్ పేర్కొన్నారు. ఇదిలావుంటే బ్రిటన్ పర్యావరణ మంత్రి లార్డ్ డీ వౌలే కూడా ఈ వివాదం సాధ్యమైనంత త్వరగా సమసిపోయేలా కృషి చేస్తానని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications