జపాన్‌లో టిసిఎస్ పాగా: బంగ్లాలో ‘హీరో’

దీని ప్రకారం జపాన్‌లోని టిసిఎస్ అనుబంధ సంస్థలైన టిసిఎస్ జపాన్, నిప్పన్ టిసిఎస్ సొల్యూషన్ సెంటర్‌లు మిత్సుబిషి పూర్తి యాజమాన్య హక్కులు కలిగిన అనుబంధ సంస్థ ఐటి ఫ్రాంటైర్ కార్పొరేషన్ (ఐటిఎఫ్)తో విలీనం కానున్నాయి. అనంతరం వీటి కలయికలో ఓ ఐటి కంపెనీ ఏర్పాటవుతుంది. ఇది ఏటా 600 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తుందని ఇరు సంస్థలు అంచనా వేస్తున్నాయి.
కాగా, టిసిఎస్ జపాన్, నిప్పన్ టిసిఎస్ సొల్యూషన్ సెంటర్, ఐటి ఫ్రాంటైర్ కార్పొరేషన్ విలీనంతో ఏర్పడబోయే సంస్థకు ఇంకా పేరును నిర్ణయించాల్సి ఉండగా, ఇందులో టిసిఎస్‌కు 51 శాతం వాటా, మిట్సుబిషికి 49 శాతం వాటా ఉండనుంది. అన్ని అనుమతులు లభిస్తే ఈ ఏడాది జూలై నుంచి కొత్త సంస్థ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. జూలైలో మొదలైతే ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం 300 బిలియన్ డాలర్లుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా టిసిఎస్ మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. నిప్పన్ టిసిఎస్ సొల్యూషన్ సెంటర్, టిసిఎస్ జపాన్, ఐటి ఫ్రాంటైర్ కార్పొరేషన్‌లను విలీనం చేసి ఏటా 600 మిలియన్ డాలర్ల ఆదాయ సామర్థ్యం కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూన్‌కల్లా ఈ ఒప్పందం ముగుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను సంబంధిత రెగ్యులటేరీ వ్యవస్థల నుంచి పొందేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం టిసిఎస్ జపాన్ 100 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసిందని చంద్రశేఖరన్ గుర్తుచేశారు. నిజానికి కొత్త సంస్థలో మరింత వాటాను అందుకునే వెసులుబాటు కూడా తమకు లభించిందన్నారు.
బంగ్లాదేశ్‌లో హీరో మోటోకార్ప్ జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్ బంగ్లాదేశ్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు వీలుగా ఆ దేశానికి చెందిన నైటాల్ నిలోయ్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జాయింట్ వెంచర్‌లో హీరోమోటో కార్ప్‌కు 55 శాతం వాటాలుంటాయి. జాయింట్ వెంచర్ కింద రానున్న ఐదేళ్లకాలంలో 240 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో ఏడాదికి లక్షన్నర యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. భారత్ వెలుపల హీరో మోటోకార్ప్ ఏర్పాటు చేస్తున్న తొలి పూర్తి స్థాయి ప్లాంట్ ఇదే. 2015-16 ద్వితీయ త్రైమాసికానికి ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పని ప్రారంభించనుంది. కంపెనీ వ్యూహాత్మక అంతర్జాతీయ విస్తరణ పథకాల్లో ఇది ఒక మైలురాయని హీరో సిఎండి పవన్ ముంజాల్ పేర్కొన్నారు. నైటాల్ గ్రూప్ బంగ్లాదేశ్‌లో టాటా మోటార్స్ వాహనాలను మార్కెట్ చేస్తోంది. ఈ నూతన ప్లాంట్ నిర్మాణానంతరం బంగ్లా మార్కెట్ వాటాలో 20 శాతం సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ తెలిపారు.


Click it and Unblock the Notifications