ఎన్నికల మానిఫెస్టోలో ‘ఐటి’ని చేర్చండి: ఇట్స్ ఏపి
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐటి, ఐటి ఆధారిత సేవా రంగాల (ఐటిఈఎస్) వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ.. ఆయా పథకాలను తమ ఎన్నికల ప్రణాళికలలో చేర్చాలని రాజకీయ పార్టీలకు ఇట్స్ ఏపి (ఐటి అండ్ ఐటిఈఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) విజ్ఞప్తి చేసింది. ఐటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఐటి, ఐటిఇఎస్ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి పొందుపర్చాలని సూచించింది.
అంతేగాక ఇరు రాష్ట్రాల్లో ఐటి పరిశ్రమను వృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు సైబరాబాద్ వంటి ఐటి డిస్ట్రిక్ట్‌లను రాబోయే కొత్త ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరింది. ప్రాధాన్యతా ప్రాతిపదికన ఐటి పరిశ్రమకు భూ కేటాయింపులు చేయటంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అవసరమైన చట్టబద్దమైన అనుమతులను ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఇట్స్ఎపి సూచించింది.

రెండు రాష్ట్రాల్లో ఐటి పరిశ్రమ వృద్ధి కోసం ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు తమ సిఫారసులను అందజేసినట్లు ఇట్స్ఎపి ప్రెసిడెంట్ వి రాజన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ ఐటి, ఐటిఇఎస్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్తానంలో ఉందని ఆయన తెలిపారు. ఈ రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన టాలెంట్, మౌలిక సదుపాయాలు, వ్యాపార వాతవరణం ఇక్కడ ఉందని ఇట్స్ఎపి ప్రగాఢంగా విశ్వసిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇట్స్‌ఏపి చేసిన సిఫారసులను రెండు రాష్ట్రాలు అమలు చేస్తే ఐటి, ఐటిఈఎస్ రంగంలో అగ్రస్థానంలో నిలవటం ఖాయమని రాజన్న అన్నారు. అంతేకాకుండా ఈ రంగ వృద్ధి కోసం ద్వితీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సిన అసవరం ఉందని ఆయన తెలిపారు. వరంగల్, వైజాగ్, కరీంనగర్, విజయవాడ, తిరుపతి, నిజామాబాద్, కాకినాడ వంటి నగరాల్లో ఐటి, ఐటిఇఎస్ పరిశ్రమ వృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ఇట్స్‌ఏపి కోరింది. ఐటి అనుమతుల కోసం ఏకగవాక్ష(సింగిల్ విండో) విధానాన్ని అమలు చేయాలని సూచించింది.


Click it and Unblock the Notifications