
ఈ మేరకు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి ఎవెలిన్ విడ్మర్‌కు చిదంబరం రెండు పేజీల లేఖను రాశారు. 2009 ఏప్రిల్‌లో జి20 నాయకులు తీసుకున్న నిర్ణయాలను ఈ లేఖలో ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించి గోప్యతకు కాలం చెల్లినట్టు ఆ నాటి సమావేశంలో తీర్మానం జరిగిందని, అయినా దానిని స్విట్జర్లాండ్ ప్రభుత్వం లెక్కచేయడం లేదని చిదంబరం అన్నారు. ఇంకా మొండిగా వ్యవహరిస్తే స్విట్జర్లాండ్‌ను నాన్ కో-ఆపరేటివ్ దేశంగా ప్రకటించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
భారత్, స్విట్జర్లాండ్ మధ్య ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం కుదిరిందని, ఇందులోని నియమ నిబంధనలను స్విట్జర్లాండ్ ఎంత మాత్రం పాటించడం లేదని చిదంబరం పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ పన్ను అధికారులు కోరితే.. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న భారతీయుల వివరాలను ఆ దేశ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, ఒప్పందం మేరకు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న ఖాతాల వివరాలు తెలియజేయాలని పన్ను అధికారిక సంస్థలు కోరినా ఆ దేశం మాత్రం నిరాకరిస్తోందని చిదంబరం తెలిపారు.
నల్లధనానికి సంబంధించిన అన్ని కేసులను విచారించేందుకు ఒక ప్రత్యేక విచారణా బృందం(సిట్) ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న కేంద్రం అభ్యర్ధనను సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించిన విషయంతెలిసిందే. అంతేకాకుండా నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో కేంద్రం ఆరు దశాబ్దాలుగా విఫలం అవుతోందని మొట్టికాయ వేసింది. ఈ నేపథ్యంలో చిదంబరం స్విట్జర్లాండ్ తన బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల సమాచారాన్ని ఇవ్వడం లేదని ప్రకటించారు. కాగా, చిదంబరం రాసిన లేఖకు త్వరలోనే సమాధానం ఇవ్వనున్నట్టు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది.


Click it and Unblock the Notifications