రూ. 20వేల కోట్లు డిపాజిట్ చేస్తాం: సుప్రీంకు సహారా

కోర్టు తమ ప్రతిపాదనను ఆమోదిస్తే మూడు పని దినాల్లో 2500 కోట్ల రూపాయలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు సహారా వెల్లడించింది. బ్యాంకు ఖాతాల నిర్వహణకు కంపెనీలను అనుమతించాలని కూడా సహారా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. సహారా తాజా ప్రతిపాదనలను బుధవారం కోర్టు పరిశీలిస్తుంది. మంగళవారంనాడు సహారా అధినేత సుబ్రతారాయ్ బెయిల్‌పై విచారణ సందర్భంగా తాజా ప్రతిపాదనలను సహారా గ్రూప్ కోర్టు ముందు ఉంచింది. తొలుత 18 నెలల వ్యవధిలో వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన సహారా ఇప్పుడా వ్యవధిని ఏడాది కాలానికి కుదించింది.
కొత్త ప్రతిపాదనలో భాగంగా ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తం 20 వేల కోట్ల రూపాయల్లో 2500 కోట్ల రూపాయలను మూడు పనిదినాల్లో సెబి వద్ద డిపాజిట్ చేస్తారు. ఈ ఏడాది జూన్30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31న... మొత్తం మూడు వాయిదాల్లో 3500 కోట్ల చొప్పున సెబికి అందజేస్తారు. మిగతా 7000 కోట్ల రూపాయలను మార్చి 2015న సెబి వద్ద డిపాజిట్ చేస్తారు.
సహారా గ్రూప్‌నకు చెందిన రెండు కంపెనీలు చట్టవిరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రూ. 24000 కోట్లు సమీకరించినట్టుగా రెగ్యులేటరీ సంస్థ సెబి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసు కోర్టుకు వెళ్లిన తర్వాత ఇన్వెస్టర్ల సొమ్ము తిరిగి చెల్లించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కోర్టు ఆదేశాలను పాటించకుండా సహారా తాత్సారం చేయడంతో సెబి మళ్లీ కోర్టును ఆశ్రయించింది.
కోర్టు ఎదుటు హాజరుకావాలన్న ఆదేశాలను ధిక్కరించడంతో సహారా గ్రూప్ అధిపతి సుబ్రతా రాయ్ అరెస్ట్‌కు కోర్టు నాన్‌బెయిలబుల్ ఆరెస్టు వారెంట్లను జారీ చేసింది. పోలీసులు అరెస్టు చేసి ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చగా ఈ నెల 4న జుడిషియల్ కస్టడికి పంపింది. తనను నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ బెయిల్ కోసం సుబ్రతా రాయ్ దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం విచారణలో ఉంది.


Click it and Unblock the Notifications