కెజి బేసిన్ వివాదం: ఓఎన్‌జిసికి డిజిహెచ్ మద్దతు
న్యూఢిల్లీ/గుంటూరు: కృష్ణా-గోదావరి బేసిన్‌లో తమకు కేటాయించిన క్షేత్రాల్లో సహజవాయువును రిలయన్స్ అక్రమంగా తోడుకుంటోందేమోనన్న తమ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు, ఈ అంశాన్ని పరిశీలించి నిగ్గుతేల్చేందుకు అంతర్జాతీయ నిపుణులను నియమించాలన్న ఓఎన్‌జిసి డిమాండ్‌కు చమురు నియంత్రణా సంస్థ డిజిహెచ్ మద్దతుగా నిలిచింది.
కెజి బేసిన్‌లో తమ నామినేటెడ్ క్షేత్రాలకు కొన్ని వందల మీటర్ల దూరంలో కెజి డి6 బ్లాకులో ఆర్ఐఎల్ మూడు బావులను తవ్విందని, వీటిలో రెండు బావులు తమకు కేటాయించిన రిజర్వాయర్ పరిధిలోని సహజవాయువును తోడుకుంటున్నాయని ఒఎన్‌జిసి అనుమానిస్తోంది. ఇప్పటివరకు ఈ క్షేత్రాలనుంచి తాము ఉత్పత్తి మొదలు పెట్టలేదని, ఈలోపు ఆర్ఐఎల్ తమ వాటా సహజవాయువును అక్రమంగా తోడుకుంటుంన్నదేమోనని ఓఎన్‌జిసి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అనంతరం డిజిహెచ్ ఆర్ఐఎల్‌కు లేఖ రాసింది. కేజీ బేసిన్‌లో ఒఎన్‌జిసికి, సంస్థ అన్వేషణలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కేజీ బేసిన్ కాంట్రాక్టరైన ఆర్ఐఎల్ కాంట్రాక్టు నియమావళికి కట్టుబడి ఉండాలని, ఒఎన్‌జిసి లేవనెత్తిన ఆందోళనలు పరిష్కరించేందుకు ఒఎన్‌జిసికి సహకరించాలని డిజిహెచ్ ఆర్ఐఎల్‌కు రాసిన లేఖలో పేర్కొంది. వీలయినంత తొందరలో రెండు కంపెనీలు కలిసి ఈ అంశంపై ఒక జాయింటు రిపోర్టు సమర్పించాలని డిజిహెచ్ ఆదేశించింది.
కృష్ణపట్నంలో యూరియా ప్లాంట్: సాంబశివరావు
గుంటూరు: రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో 2,500 కోట్ల రూపాయలతో యూరియా ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు క్రిభ్‌కో మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూరియా తయారీ కేంద్రానికి 300 ఎకరాలు భూమి కేటాయించినట్లు చెప్పారు. గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017 నాటికి ఈ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
మొదటి విడతలో ఆరు లక్షల మెట్రిక్ టన్నులు, రెండో విడతలో మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని జత చేస్తామని సాంబశివరావు చెప్పారు. దేశీయంగా ప్రతి ఏడాది 320 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో క్రిభ్‌కో వాటా 16 శాతంగా ఉందని చెప్పారు. క్రిభ్‌కో ఎండిగా ఇటీవలే నియమితులైన సాంబశివరావు ఏప్రిల్ 2న బాధ్యతలు స్వీకరించనున్నారు.


Click it and Unblock the Notifications