ఎయిర్ షో: హైదరాబాద్‌లో విమానాల సందడి
హైదరాబాద్: నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇండియా ఏవియేషన్ 2014 అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రపంచంలోని వివిధ రకాల విమానాలు కొలువు దీరనున్నాయి. పౌర, వాణిజ్య విమానాలు, అత్యవసర ప్రయాణాలు- వైద్య సేవలకు ఉపయోగపడే హెలీకాప్టర్లు.. విమానాల ఇంజిన్లు, విడిభాగాల తయారీ సంస్థలు, సేవా సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్, ఎయిర్‌బస్ ఎ-380 ఈ సారి షోకు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఈ ప్రదర్శన ఐదు రోజులపాటు జరగనుంది.
కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు ఎయిర్ కనెక్టివిటీని పెంచడం ఎలా అన్న అంశమే ప్రధాన ఇతివృత్తంగా ఉంది. బోయింగ్, ఎయిర్‌బస్, బార్డియర్, డసాల్, రోల్స్‌రాయిస్.. వంటి సంస్థలు ఈ షోలో పాల్గొంటున్నాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అజిత్ సింగ్ బుధవారం లాంఛనంగా ఏవియేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచెర్, అమెరికా ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ లియోకాడియా జాక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ ఇండియా ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్నట్లు హెచ్ఎఎల్ (బెంగుళూరు) ప్రకటించింది. ఈ ప్రదర్శనలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్), మల్టీ రోల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటిఎ), డోర్నియర్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్(ఎల్‌యూహెచ్)లను ప్రదర్శించనున్నట్లు హెచ్ఎఎల్ చైర్మన్ డాక్టర్ ఆర్‌కె త్యాగి బెంగళూరులో చెప్పారు. హెచ్ఎఎల్ నిర్వహణలోని బెంగళూరు, నాసిక్ విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేసే అంశంపై దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలోని మధ్య తరగతి జనాభాను, జిడిపి వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుంటే విమానయాన పరిశ్రమ వృద్ధికి అవకాశాలు అపారంగా ఉన్నాయని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగం ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. మన మొత్తం విమానాల సంఖ్య 400 మాత్రమే. 2020 నాటికి మన విమానాల సంఖ్య 1000ని దాటే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో భారత్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications