ఆర్‌జిఐఏకు అవార్డు: విజయ్ మైనింగ్ సిఎండి అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాని(ఆర్‌జిఐఏ)కి మరో అవార్డు దక్కింది. విమానాశ్రయ సేవా నాణ్యత (ఏఎస్‌క్యూ)లో వరుసగా రెండో ఏడాదీ ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసిఐ) అవార్డు లభించినట్లు ఆర్‌జిఐఏ నిర్వహణ సంస్థ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జిహెచ్ఐఏఎల్) తెలిపింది.
50 లక్షల నుంచి 1.50 కోట్ల ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల్లో ఉత్తమ సేవలకు గాను గత ఏడాది ఏసిఐ నుంచి ద్వితీయ ఉత్తమ అవార్డు అందుకున్నామని, ఈ ఏడాదీ అదే అవార్డు లభించిందని జిఎంఆర్ సంస్థ పేర్కొంది. 2009, 2010 సంవత్సరాల్లో ప్రథమ స్థానంలో, 2011 తృతీయ స్థానం లభించాయని తెలిపింది.

విజయ్ మైనింగ్ సిఎండి అరెస్ట్
సేవా పన్ను వసూలు చేసి, ఆ మొత్తాన్ని చెల్లించలేదనే ఆరోపణలపై విజయ్ మైనింగ్ అండ్ ఇన్‌ఫ్రాకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిఎండిని బుధవారం అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ హైదరాబాద్-2 కమిషనర్ ఎంకె సింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయ్ మైనింగ్ సిఎండి రూ. 20 కోట్ల మేర సేవా పన్ను ఎగవేశారని కమిషన్ తెలిపారు.
విసిఈఎస్ (వాలంటరీ కాంప్లియన్స్ ఎంకరేజ్‌మెంట్ స్కీమ్) పథకం కింద దరఖాస్తు చేసుకుని, అందులో ప్రకటించిన మొత్తం నిబంధనల ప్రకారం 50శాతం సేవా పన్ను చెల్లించాల్సి ఉండగా, అది కూడా చెల్లించలేదని సింగ్ తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు. 1994 ఆర్థిక చట్టంలోని 89(1)(2) సెక్షన్ కింద విజయ్ మైనింగ్ సిఎండిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్లు సింగ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications