మొండి బకాయిలు: తగ్గిన ఎస్‌బిఐ లాభాలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) లాభాలను ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మొండి బకాయిలు దెబ్బతీశాయి. గత ఏడాదితో పోల్చితే 34 శాతం క్షీణించి 2,234 కోట్ల రూపాయలకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎస్‌బిఐ 3,396 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది.
మొండి పద్దులు (ఎన్‌పిఎ), పెన్షన్ ప్రయోజనాల కోసం అధిక నిధులు కేటాయించడం, పెట్టుబడుల్లో చవిచూసిన నష్టాల వల్ల లాభాలు దెబ్బతిన్నాయని ఎస్‌బిఐ వెల్లడించింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. గత ఏడాది ఎన్‌పిఎల కోసం 2,766.18 కోట్ల రూపాయలు కేటాయించగా, సమీక్షాకాలంలో అవి 3,428.59 కోట్ల రూపాయలకు పెరిగాయి.

మొత్తం ఎన్‌పిఎల్లో మధ్యస్థాయి కార్పొరేట్, ఎస్ఎంఇ రంగాల వాటా అధికంగా ఉందని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. జిడిపి పుంజుకుని వినియోగదారుల చెల్లింపుల సామర్థ్యం పెరగాలంటే మరికొన్ని త్రైమాసికాలపాటు వేచి చూడాల్సిందేనని భట్టాచార్య తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందని భట్టాచార్య పేర్కొన్నారు.
తాజాగా ఎన్‌పిఎల్లో చేరిన 11,000 కోట్ల రూపాయల్లో ఎస్ఎంఇ, మధ్యస్థాయి కార్పొరేట్ల వాటానే 9,500 కోట్ల రూపాయలుగా ఉందని అరుంధతీ భట్టాచార్య చెప్పారు. సమీక్షాకాలంలో 6,165 కోట్ల రూపాయల రుణాలు పునర్‌వ్యవస్థీకరణ జాబితాలో చేరాయని ఆమె తెలిపారు. 5,000 కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేశామని వెల్లడించారు. ప్రజల మధ్య ఆర్థిక, ఆదాయ, అభివృద్ధి పరమైన బేధాలను తొలగించే దిశగా అడుగులు వేయాల్సి ఉందని భట్టాచార్య అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications