ఖాతా లేకున్నా ఏటిఎం నుంచి క్యాష్: రాజన్
ముంబై: రిజర్వు బ్యాంకు గవర్నర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విభిన్న అంశాలను పరిష్కరించడంలో సాంప్రదాయేతర పద్ధతులను అనుసరిస్తున్న రఘురాం రాజన్ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే బ్యాంకు ఖాతా లేకపోయినప్పటికీ (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్)ఏటిఎం నుంచి నగదు డ్రా చేసుకునే విధానం అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి మాత్రమే ఏటిఎంలలో నగదు డ్రా చేసుకునే వీలున్న విషయం తెలిసిందే.
అయితే త్వరలో అకౌంట్ లేకపోయినా ఏటిఎం నుంచి మొబైల్ టెక్నాలజీతో నగదు డ్రా చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం ప్రకటించారు. ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ టెక్నాలజీపై నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ ఫోరమ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఇటీవలే తాము ఈ విధానాన్ని ఆమోదించామని చెప్పారు. దీని వల్ల బ్యాంకు ఖాతాదారుల నుంచి ఖాతాలు లేనివారికి ఏటిఎం ద్వారా నిధులు అందుతాయని పేర్కొన్నారు.

ఏటిఎం లావాదేవీల ద్వారా తన అకౌంట్ నుంచి మరొకరు నగదు డ్రా చేసుకోవాలన్నప్పుడు ఖాతాదారుకి ఓ కోడ్ అందుతుంది. ఎవరైతే నగదును డ్రా చేసుకుంటారో వారి మొబైల్‌కు ఆ కోడ్‌ను పంపితే దగ్గర్లోని ఏ బ్యాంకు ఏటిఎం నుంచైనా సరే కోడ్‌ను వినియోగించి నగదును డ్రా చేసుకోవచ్చు. ఈ విధానంలో కొన్ని భద్రతాపరమైన సూచనలు, నిబంధనలు ఉంటాయని రాజన్ వివరించారు. మరిన్ని కొత్త విధానాలను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు. సాధారణ బ్యాంకింగ్ సేవలకు దూరంగా దేశంలో ఎందరో ఉన్నారని, వారికి కూడా బ్యాంకింగ్ సేవలను దగ్గర చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
మోసాలను అరికట్టేందుకు సోషల్ మీడియా
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయడానికి సోషల్ మీడియాను కూడా ఒక సాధనంగా వినియోగించవచ్చని భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు.
మోసాలను గుర్తించేందుకు సోషల్ మీడియాను సాధనంగా వినియోగించగలమా? మోసపూరిత సమాచారాన్ని సమీకరించి, బాధ్యతయూతంగా వడకట్టగలమా అనేదానిపై చర్చించాల్సిన అవరసం ఉందని తెలిపారు ప్రస్తుతానికి మోసాల కట్టడికి సోషల్ మీడియా వినియోగం అనేది ఒక ఆలోచనేనని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు లేవని, అయినా దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications