న్యూఢిల్లీ: భారతీయ ఔషధరంగ సంస్థలపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్‌ఎఫ్‌డిఎ) తీసుకుంటున్న చర్యలపై, విధిస్తున్న జరిమానాలపై భారత్ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. సరసమైన ధరలో ఔషధాలు అందించడమంటే నకిలీవి తయారు చేస్తున్నట్లు కాదని తెలిపింది. యూఎస్ఎఫ్‌డిఏ కమిషనర్ మార్గరేట్ ఎ హంబర్గ్‌తో సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఆనంద్ శర్మ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ లు వేర్వురుగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశాలపై తాము లేవనెత్తిన కొన్ని ఆందోళనలను నివేదిక రూపంలో అమెరికాకు అందజేస్తామని తెలిపారు. హంబర్గ్ మాట్లాడుతూ.. సమావేశం బాగా జరిగిందని, ఇంతకంటే ఏమీ చెప్పదలుచుకోలేదన్నారు. కాగా, గత నెల జనవరి 23న రాన్‌బాక్సీ లాబొరేటరీస్‌కు చెందిన టోన్సా ప్లాంట్‌లోని ఉత్పత్తులపై అమెరికా హెల్త్ రెగ్యులేటర్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

అంతకుముందు దేవాస్, పౌంటా సాహిబ్, మొహాలి ప్లాంట్లపైనా అగ్రరాజ్యం ఆరోగ్య నియంత్రణ వ్యవస్థ ఇలాగే వ్యవహరించింది. 2013లో రాన్‌బాక్సీ అమెరికా అధికారులకు 500 మిలియన్ డాలర్ల జరిమానాను చెల్లించేందుకు అంగీకరించింది. తయారీ, సరఫరా తదితర అంశాల్లో నిబంధనలను పాటించలేదంటూ అమెరికా ఈ జరిమానాను విధించింది. మరో భారతీయ సంస్థ వోక్‌హార్డ్‌కు సంబంధించిన రెండు ప్లాంట్లలో తయారైన ఔషధాల ఎగుమతినీ యుఎస్‌ఎఫ్‌డిఎ నిషేధించింది.
ఇలాంటి చర్యలు అమెరికాకు భారతీయ ఔషధ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే ఆందోళన కూడా పరిశ్రమ వర్గాల నుంచి పెరిగిపోయింది. గత ఆర్థిక సంవత్సరం భారతీయ ఫార్మా ఎగుమతులు 10 శాతం పెరిగి 14.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో అమెరికాకైన ఎగుమతులు 26 శాతం, అమెరికాకు విదేశాల నుంచి జరిగే జనరిక్ ఎగుమతుల్లో భారత్ నుంచి జరిగేవే అధికం కావడం గమనార్హం. భారత్‌లో దాదాపు యుఎస్‌ఎఫ్‌డిఎ ఆమోదం పొందిన 320 ఔషధ సంస్థలున్నాయి.


Click it and Unblock the Notifications