
మానవ వనరుల నియామక సర్వీసుల దిగ్గజం రాండ్‌స్టడ్ ఇండియా అంచనాల ప్రకారం.. వచ్చే దశాబ్దకాలంలో బ్యాంకింగ్ రంగం 7 నుంచి 10 లక్షల ఉద్యోగాలను కల్పించనుంది. ఈ ఏడాదిలో అధికంగా ఉద్యోగాలను ఇచ్చే అగ్రశ్రేణి రంగాల్లో బ్యాంకింగ్ రంగం కూడా చోటు దక్కించుకోనున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. ప్రభుత్వరంగంలోని బ్యాంకులే రానున్న కొన్నేళ్ల కాలంలో 5 నుంచి 7 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని తెలిపింది.
దిగువ, మధ్యస్థాయిల్లోని దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారని, వారి స్థానంలో కొత్త నియామకాలు తప్పనిసరని సంస్థ పేర్కొంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొత్త బ్యాంకింగ్ లైసెన్స్‌లు జారీ అయ్యే అవకాశం ఉందని, ఫలితంగా ఈ రంగం కొత్తగా ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం ఉందని రాండ్‌స్టడ్ ఇండియా, శ్రీలంక సిఈఓ మూర్తి కె ఉప్పలూరి తెలిపారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో భాగంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకులు విస్తరిస్తున్నాయని, ఫలితంగా వాటి వ్యాపారం పెరిగే అవకాశం ఏర్పడుతోందని మూర్తి అన్నారు.
భారతదేశ జనాభాలో 30 శాతం కన్నా తక్కువ మందికే బ్యాంకు ఖాతాలున్నాయని, ఈ నేపథ్యంలో బ్యాంకులకు అపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించేందుకు బ్యాంకులు పెద్ద ఎత్తున బిజినెస్ కరెస్పాండెంట్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఇతర బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్‌ను నియమించుకుంటున్నాయని, రానున్నకాలంలో టైర్2, టైర్3 నగరాల్లో ఇది మరింత ఊపందుకోనుందని మూర్తి పేర్కొన్నారు.
కాగా ముంబై, చెన్నై, ఎన్‌సిఆర్ రీజియన్‌లో రానున్న కాలంలో ఎక్కువగా బ్యాంకింగ్ సంబంధిత ఉద్యోగుల నియామకాలు జరగనున్నట్టు రాండ్‌స్టడ్ పరిశీలనలో వెల్లడైంది. బ్యాంకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయని, ఫలితంగా రానున్న కొన్నేళ్ల కాలంలో విపరీతంగా ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతోందని టాలెంట్ అసెస్‌మెంట్ కంపెనీ మెరిట్ ట్రాక్ సర్వీసెస్ సిఈఓ వాసు కె సక్సేనా తెలిపారు.
నేటి నుంచి రెండ్రోజులపాటు బ్యాంకుల సమ్మె
వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు సంఘాలు సోమవారం, మంగళవారం సార్వత్రిక సమ్మెకు దిగనున్నాయి. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. గత గురువారంనాడు చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) వేతనాన్ని పెంచేందుకు సమ్మతించలేదని, దీని మూలంగా సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యుఎఫ్‌బియు) పేర్కొంది.


Click it and Unblock the Notifications