శక్తిమంతుల జాబితాలో భారత మహిళలు
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళల్లో భారత్‌కు చెందిన పెప్సికో సిఈఓ ఇంద్రా నూయి, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) చందా కొచ్చర్‌లకు స్థానం లభించింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత శక్తిమంతమైన 50 మంది వ్యాపార మహిలతో ఫార్చ్యూన్ మేగజైన్ జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలతో ఇంద్రా నూయి మూడో స్థానంలో, చందా కొచ్చర్ 18వ స్థానంలో నిలిచారు.
జాబితాలోని మహిళలు ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలను విస్తరిస్తూ, తమ స్వదేశాల్లోని మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఫార్చ్యూన్ ప్రశంసించింది. అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ సిఈఓ మేరీ బరా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆటో మొబైల్ కంపెనీకి సారథ్యం వహిస్తున్న మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆరు ఖండాల్లో విస్తరించిన జనరల్ మోటార్స్, 396 యూనిట్లను కలిగి ఉంది. మొత్తం 2,12,000 మంది ఉద్యోగులు ఆ కంపెనీలో పని చేస్తున్నారు.

కాగా ఇంద్రా నూయీ పెప్సికో బాధ్యతలు చేపట్టిన ఏడేళ్ల కాలంలో అమెరికా బయటి మార్కెట్లలో పెప్సి అమ్మకాలు రెండింతలు పెరిగాయి. కంపెనీ మొత్తం ఆదాయంలో వీటి వాటా 6,550 కోట్ల డాలర్లుగా ఉంది. చందా కొచ్చర్ దేశంలో రెండో అతి పెద్ద బ్యాంకైన ఐసిఐసిఐ బ్యాంకును విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్యాంకుకు 12,400 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. 3,588 శాఖలు, 150 కోట్ల డాలర్ల లాభాలు ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు 19 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వలసదారుల నుంచి స్వదేశల్లోని వారి కుటుంబాలకు నగదు బదిలీ చేస్తుంది.
ఇంకా ఈ జాబితాలో ఐబిఎం చైర్మన్, సిఈఓ, ప్రెసిడెంట్ జిన్నీ రోమెటీ రెండో స్థానంలో, ఎనర్జీ కార్పొరేషన్ పెట్రోబ్రాస్ సిఈఓ మరియా దాస్ గ్రేకస్ సిల్వా ఫోస్టర్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్ సిఓఓ షెరిల్ శాండ్‌బెర్గ్ పదకొండో స్థానంలో, యాహూ ప్రెసిడెంట్, సిఈఓ మరిసా మేయర్ పద్నాలుగో స్థానంలో, గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రకటనలు, వ్యాపార విభాగం) సుజాన్ వోజ్‌కీ 20వ స్థానంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications