ఆర్‌బిఐ నిర్ణయం: అంచనాలు తలకిందులు

రాజన్ తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బిఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ) 7.75 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది. రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి తాను సేకరించే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ) కూడా 7 శాతానికి పెరిగింది. సిఆర్ఆర్, ఎంఎస్ఎఫ్‌లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్‌బిఐ రేట్లు తగ్గించినంత మాత్రాన బ్యాంకు నిధుల వ్యయాల పై గాని, వడ్డీ రేట్ల పై గాని దాని ప్రభా వం ఉండడంలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ తన చర్యను రఘురాం రాజన్ సమర్థించుకున్నా రు.
ద్రవ్యోల్బణం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉందని అభిప్రాయపడ్డ రాజన్.. వడ్డీరేట్ల పెంపు ఉండదనే సంకేతాలు ముందస్తుగానే ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తాజా సమీక్షలో రెపో రేటను పావు శాతం పెంచడంతో ఇప్పుడు పారిశ్రామిక వర్గాలు లబోదిబోమంటున్నాయి. అయినప్పటికీ పెంచిన వడ్డీరేట్లు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమేగాక, ద్రవ్యోల్బణాన్ని దారిలోకి తెస్తుందనే విశ్వాసాన్ని రాజన్ వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే మున్ముందు సమీక్షల్లో ఇక వడ్డింపులు ఉండకపోవచ్చనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆర్‌బిఐ గ్రద్ద గాని, పావురం గాని కాదని, అది నిరంతరం అప్రమత్తంగా ఉండే గుడ్లగూబ వంటిదని రఘురాం రాజన్ ప్రకటించారు. అంచనాలో పావురం వలె కనిపిస్తూ కార్యాచరణలో గ్రద్ద వలె వ్యవహరించారన్న వ్యాఖ్యలకు ఆయన సమాధానంగా.. గుడ్లగూబ వివేకానికి ప్రతీక అని, నిరంతర అప్రమత్తతే దాని వైఖరి అని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఏది అవసరమో దాన్ని మాత్ర మే చేసే తాము గుడ్లగూబ వంటి వారమని ఆయన అనగానే మీడియా సమావేశంలో నవ్వుల జల్లు కురిసింది.
మరోవైపు బ్యాంకింగ్ వర్గాలు తాజా పెంపు నేపథ్యంలో రుణాలపై వడ్డీరేట్ల పెంపుపై సమీక్షించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని చెబుతున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ వృద్ధిరేటు అంచనాను 5 శాతం దిగువకు చేర్చింది. ఇంతకుముందు 5.5 శాతంగా నమోదవుతుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. కాగా కరెంట్ ఖాతా లోటు మాత్రం జిడిపిలో 2.5 శాతం దిగువకు పడిపోతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 4.8 శాతంగా నమోదైంది.


Click it and Unblock the Notifications