న్యూఢిల్లీ/ముంబై: హిందూజా గ్రూప్ కంపెనీ అశోక్ లేలాండ్ ‘కెప్టెన్' పేరుతో కొత్త వాణిజ్య శ్రేణి వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. సోమవారం న్యూఢిల్లీలో కొత్త టిప్పర్ మోడల్ వాహనం కెప్టెన్ 2523ను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరితో కలిసి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విడుదల చేశారు. భారీ బరువులను మోయగలిగే ఈ కెప్టెన్ ట్రక్కులు 16 టన్నుల స్థూల బరువు (జివిడబ్ల్యూ) నుంచి 49 జివిడబ్ల్యూ దాకా లభ్యమవుతాయి.
ఈ సందర్భంగా ఎండి వినోద్ కె దాసరి మాట్లాడుతూ.. ఈ శ్రేణిలో టిప్పర్లు, ట్రాక్టర్లు, వాహనాలను మోసే హాలేజ్ వాహనాలు ఉంటాయన్నారు. 160 హెచ్‌పి నుంచి 360 హెచ్‌పి మధ్య సామర్థ్యంతో, సిఆర్ఎస్ ఇంజిన్లతో వస్తున్న ఈ శ్రేణి వాహనాలు అత్యుత్తమ ఇంధన సామర్థ్యం గలవని దాసరి వివరించారు. ఇవి వాహన కార్యకలాపాల వ్యయాలనూ తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు.

కెప్టెన్ రేంజ్ కింద కొత్త శ్రేణి, మధ్య, భారీ వాణిజ్య వాహనాలను తీసుకువచ్చేందుకు గాను దాదాపు 600-700 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వినోద్ వెల్లడించారు. ఈ వాహనాలను పంత్‌నగర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వాహన క్యాబిన్ డిజైన్ కోసం ఇటాలియన్ సంస్థ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోసం యుకె సంస్థ నుంచి సహాయం తీసుకున్నట్లు చెప్పారు. కెప్టెన్ శ్రేణి ట్రక్కులను పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆప్రికా, ఈశాన్య ఆసియా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వినోద్ పేర్కొన్నారు.
ఎన్నారైలకు బోనస్‌గా డిబెంచర్లు
ముంబై: భారత కంపెనీలు ప్రవాసులకు ఇకపై బోనస్‌గా నాన్ కన్వర్టబుల్ లేదా రిడీమేబుల్ ప్రిఫరెన్షియల్ షేర్లు గానీ డిబెంచర్లను జారీ చేయవచ్చని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) సోమవారం స్పష్టం చేసింది. కంపెనీల నుంచి వచ్చిన పలు అభ్యర్థనలను పరిశీలించి, సమీక్షించిన పిమ్మట ఆర్‌బిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కంపెనీల చట్టంలో సంబంధిత నియమావళికి లోబడి ఉండే స్కీమ్ ఆఫ్ అరెంజ్‌మెంట్‌ను భారత్‌లోని ఏదైనా న్యాయస్థానం ఆమోదిస్తేనే ఈ విధమైన బోనస్ షేర్లను జారీ చేయవలసి ఉంటుందని స్పష్టం చేసింది.
అంతేగాక ఆదాయపు పన్ను విభాగం అధికారులు తమకెలాంటి అభ్యంతరం లేదని తెలపాల్సి ఉంటుందని కూడా రిజర్వు బ్యాంక్ పేర్కొంది. ఈ మేరకు సోమవారం తాను తీసుకున్ని నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రిఫరెన్షియల్ షేర్లు, కన్వర్టబుల్ డిబెంచర్లు అన్నీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పథకాల నిబంధనలకు లోబడి ఉంటాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. ప్రవాసులు డిబెంచర్లను పొందినట్టయితే వీటిని తిరిగి నిర్ణీత కాలంలో నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.


Click it and Unblock the Notifications