విఫలమయ్యాం, సంస్కరణలుంటాయ్: ప్రధాని
న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వం దేశాన్ని మెరుగైన వృద్ధి బాటలో పెట్టిందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయన్న హామీని శుక్రవారం ఆయన ఇచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ... అధిక ద్రవ్యోల్బణానికి అంతర్జాతీయ వస్తు, చమురు ధరలను కారణంగా చూపారు. వృద్ధిరేటు విషయంలో దేశాన్ని తమ ప్రభుత్వం పతాక స్థాయిన నిలబెట్టేందుకు కృషి చేస్తోందని మన్మోహన్ సింగ్ అన్నారు.
ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా అంగీకరించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమయ్యాయని, ఆహార వస్తువుల ధరలను అదుపులో ఉంచడానికి సరఫరాను పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై ఆందోళన చెందడంలో న్యాయం ఉందని ఆయన అన్నారు. అయితే ధరల పెరుగుదల కన్నా ఎక్కువగా అధిక శాతం ప్రజల ఆదాయాలు పెరిగాయన్న విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. దీనివల్లే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచలేకపోయామని మన్మోహన్ అన్నారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారితీసిన వాటిలో ద్రవ్యోల్బణం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మున్ముందు మరింతగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెడుతుందని స్పష్టం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని, తయారీ రంగంలో మరింతగా ఉద్యోగావకాశాలను సృష్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. కాబట్టి తాము అధికారంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంతగా సంస్కరణలను ప్రవేశపెట్టగలమన్నారు.
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, వృద్ధిరేటు బలోపేతం వంటివి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, దీనికి అనుగుణంగా తమ విధానాలను ఎంతో చిత్తశుద్ధితో అమలు చేయడానికి ఇకముందూ సిద్ధమేనని ప్రధాని తెలిపారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తోందని, ఫలితంగానే తమ చర్యలు ప్రభావం చూపలేకపోయాయని చెప్పారు. ఈ క్రమంలోనే నవంబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 7.52 శాతానికి, వినియోగదారుల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 11.24 శాతానికి పెరిగాయని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో గతంలో కంటే వేగంగా శ్రామికుల వేతన ఆదాయం పెరిగిందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరిగిందని పేర్కొన్నారు. 2004లో 24,143 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం 2012లో 68,747 రూపాయలకు చేరిందని ప్రధాని తెలిపారు. ఆహార భద్రత చట్టం ద్వారా ఆహారోత్పత్తులు తక్కువ ధరలకే లభిస్తాయన్న ఆయన, ద్రవ్యోల్బణం బారి నుంచి పేదలను ఇది రక్షించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కాగా, తయారీ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందని, అయితే ఆ దిశగా తాము సఫలీకృతం కాలేకపోయమాన్నారు. ముఖ్యంగా, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి మరింత కృషి జరగాల్సి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ కారణాల మూలంగానే దేశ వృద్ధిరేటు మందగిస్తోందని తెలిపారు. అయినప్పటికీ రాబోయే సంవత్సరాల్లో వృద్ధిరేటు పుంజుకోగలదనే విశ్వాసాన్ని మన్మోహన్ సింగ్ వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications