2028లో జపాన్‌ను అధిగమించనున్న భారత్

అయితే లీగ్ టేబుల్‌లో ఈ ఏడాది(2013) భారత్‌ను ఒక స్థానం వెనక్కి నెట్టి కెనడా పదో స్థానంలో నిలవగా, భారత్ 11వ స్థానానికి పడిపోయింది. సెబర్.. ఏడాది మొత్తంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులను పరిశీలించి ఏడాది చివర్లో వాటికి స్థానాలను ఖరారు చేస్తుంది. 2012కు గానూ ఐఎమ్‌ఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నుంచి గణాంకాలను సేకరించిన సెబర్, రాబోయే 5, 10, 15 సంవత్సరాల్లో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల పోకడను ఈ సందర్భంగా అంచనా వేసింది.
ఇందులో భాగంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ క్రమేణా పుంజుకోనుందని సెబర్ అంచనా వేసింది. 2013లో 1,700 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్ జిడిపి, 2018లో 2,481 బిలియన్ డాలర్లకు, 2023లో 4,124 బిలియన్ డాలర్లకు, 2028లో 6,560 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా సెబర్ వేసింది. ఈ క్రమంలోనే 2018 నాటికి భారత్ ప్రపంచంలోనే 9వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరుతుందని తెలిపింది. 2023లో 4వ స్థానానికి, 2028లో జపాన్‌ను అధిగమించి 3వ స్థానానికి ఎగబాకుతుందని సెబర్ పేర్కొంది.
ఇక ఈ ఏడాదికిగానూ విడుదల చేసిన గణాంకాల్లో టాప్-20లో నిరుడితో పోల్చితే రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన ఇటలీ 9వ స్థానానికి పడిపోగా, ఆ స్థానంలో ఉన్న రష్యా 8వ స్థానానికి చేరుకుంది. అలాగే 10వ స్థానంలో భారత్ 11వ స్థానంలోకి పడిపోగా, ఆ స్థానంలో ఉన్న కెనడా 10వ స్థానానికి వచ్చింది. డాలర్‌తో పోల్చితే భారీగా పతనమైన రూపాయి విలువే దీనికి కారణమని సెబర్ తెలిపింది. ఫలితంగా కామన్వెల్త్ దేశాల్లో 2వ స్థానానికి, ప్రపంచంలో 10వ స్థానానికి కెనడా చేరగలిగిందని సెబర్ తన నివేదికలో పేర్కొంది.
ఇదిలావుంటే 2018 నాటికి రష్యా 6వ స్థానంలోకి, మెక్సికో 12, కొరియా 13, టర్కీ 17వ స్థానాల్లో ఉండగలవని సెబర్ తెలిపింది. 2023 నాటికి బ్రెజిల్ 5వ స్థానంలో ఉంటుందని, 2028లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, రెండో స్థానంలో అమెరికా, భారత్ 3, మెక్సికో 9, కెనడా 10వ స్థానాల్లో ఉంటాయని సెబర్ అంచనా వేసింది.


Click it and Unblock the Notifications